సాటి మనిషిలో దేవుడిని చూస్తోంది మనం సైతం సేవా సంస్థ. మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మిన సేవా తత్పరుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న మనం సైతం కరోనా కష్ట కాలంలో ఎంతో మందిని ఆదుకుంది. ఆపదలో ఉన్న పేదలకు ఆర్థికసాయం అందించే సేవా యజ్ఞం కొనసాగిస్తూనే, నిత్యావసర వస్తువులు అందించింది.
తాజాగా చిత్రపురి కాలనీ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్స్ కు అండగా నిలబడేందుకు మనం సైతం కాదంబరి కిరణ్ ముందుకొచ్చారు. ఈ సేవా కార్యక్రమానికి చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, రుద్రరాజు రమేష్, ఇతర టీమ్ సభ్యులు చేయూత అందించారు.
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ… ‘కరోనా టైమ్ లో మా సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తున్నాం. సాయం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది దగ్గరకు వెళ్లి సహాయం చేశాం. ప్రస్తుతం చిత్ర పురి కాలనీలో కోవిడ్ పేషెంట్లకు సహాయం చేసేందుకు ముందుకొచ్చాం. ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు భోజనం, మందుల కిట్, పీపీఈ కిట్, మాస్క్ లు, శానిటైజర్, ఇమ్యూనిటీ పొడి, ఆక్సీజన్ సిలిండర్ అందిస్తున్నాం. ఆక్సీజన్ లెవెల్స్ తెలుసుకొనేందుకు ఆక్సీమీటర్ కూడా ఏర్పాటు చేశాం. కరోనా వచ్చిన వారి వలన, మిగతా వారు ఇబ్బంది పడకూడదు అని మా చిన్న ప్రయత్నం. కోవిద్ నిబంధనలు పాటిద్దాం. కరోనాని తరిమికొడదాం. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా,ఎవరికైనా, ఎక్కడైనా మనం సైతం సిద్ధం’ అని చెప్పారు.