Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఘన విజయం

ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఘన విజయం

ఐసీసీ టి-20 వరల్డ్ కప్, నేడు జరిగిన కీలక మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఏకపక్షంగా విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జోస్ బట్లర్ బ్యాట్ తో వీరవిహారం (32 బంతుల్లో 5ఫోర్లు,5సిక్సర్లతో 71పరుగులు) చేయడంతో ఆసీస్ విసిరిన 126 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 11.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది.  కొంతకాలంగా మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో మరోసారి తమ సత్తా చాటింది.

దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి క్రిస్ ఓక్స్ బౌలింగ్ లో జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వెంట వెంట వికెట్లు కోల్పోయింది. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.  కెప్టెన్ ఆరోన్ పించ్-44; మాథ్యూ వాడే-18; ఆస్టన్ అగర్-20 పరుగులు చేశారు. చివర్లో స్టార్క్ 6 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 13, ప్యాట్ కమ్మిన్స్ మూడు బంతుల్లో రెండు సిక్సర్లతో 12 చేయడంతో ఆసీస్ 20 ఓవర్లలో 125 పరుగులైనా చేయగలిగింది. ఆస్ట్రేలియా మొత్తం పది వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు; క్రిస్ ఓక్స్, టైమల్ మిల్స్ చెరో రెండు, ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్ చెరో వికెట్ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మొదటి నుంచీ దూకుడుగానే ఆడింది, తొలి వికెట్ కు జేసన్ రాయ్, జోస్ బట్లర్ లు 66 పరుగులు జోడించారు. రాయ్-20, వన్ డౌన్ లో వచ్చిన డేవిడ్ మలన్-8 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన జానీ బెయిర్ స్టో, బట్లర్ తో కలిసి మరో వికెట్ పడకుండా ఆడడంతో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. బట్లర్-71, బెయిర్ స్టో-16 పరుగులతో అజేయంగా నిలిచారు.

నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్