Gvl Demanded For Re Poling In 28 Poling Stations Of Badvel :
బద్వేల్ ఉపఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ కనీసం 60 వేల దొంగఓట్లు వేయించిందని, పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను అద్దెకు తీసుకువచ్చి మరీ అక్రమాలకు పాల్పడిందని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఢిల్లీలో బిజేపి ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో ఏ విధంగా అయితే వ్యవహరించారో ఇక్కడ కూడా అంతకు మించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జీవీఎల్ విమర్శించారు.
అధికార పార్టీ అక్రమాలపై తాము ఎన్నికల అధికారులకు, పరిశీలకులకు ఫిర్యాదు చేశామని వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోలింగ్ 50 శాతానికి మించి జరగలేదని, వైసీపీ వేయించిన దొంగ వోట్ల వల్లే ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైఎస్సార్సీపీ వ్యవహరించిందని, పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి తొత్తులుగా పని చేశారని దుయ్యబట్టారు. పోలింగ్ లో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయించే ఆలోచన ఉందని జీవీఎల్ వెల్లడించారు.
బద్వేల్ రూరల్, బి. కోడూరు, అట్లూరు, గోపవరం మండలాల్లో కనీసం 28 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని అయన డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు వైసీపీ ఏజెంట్లతో కుమ్మక్కయ్యారని, కొన్ని చోట్ల తమ పార్టీ ఏజెంట్లను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేసి పంపించేశారని, మరికొన్ని చోట్ల పోలింగ్ అధికారులే తమ పార్టీ ఏజెంట్లను భయపెట్టి బైటకు పంపారని జీవీఎల్ విమర్శలు గుప్పించారు.
బద్వేల్ ఎన్నికల్లో వైసీపీ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిందని, ఫోటో లేని ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేయించిందని సునీల్ దియోధర్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
Must Read : బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డా. సుధ