There Is No Pressure On Aided Institutions To Surrender Cm Clearly Mentioned :
ఎయిడెడ్ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో రాజకీయాలను జొప్పించడం దురదృష్టకరమని, ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ తోపాటు పలువురు ఉన్నతాధికారులతో సిఎం సమావేశమయ్యారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకమనే కోణంలో జరుగుతున్న ప్రచారాలు, కథనాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు, ఈ సందర్భంలో ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని మరోసారి జగన్ అధికారుతో ప్రస్తావించారు.
ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, యాజమాన్యాలకు, టీచర్లకు, విద్యార్థులకు మంచిచేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ఎయిడెడ్ విద్యాసంస్థల స్థాపన వెనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటులో ఇది భాగమేనని పేర్కొన్నారు. ఆ సంస్థలను నడుపుతున్న వారికి సహాయంగా నిలిచెందుకే ఈ ప్రతిపాదనలను తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా వినియోగించుకోవచ్చని, లేదా ఇప్పడున్నట్టుగా నడుపుకోవచ్చని, దీనిలో ఎలాంటి బలవంతం లేదని వెల్లడించారు.
తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలంటూ ఎయిడెడ్ టీచర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, వారి డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని, వారిని సరెండర్ చేసి, ప్రయివేటుగా నడుపుకోవచ్చని లేదా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా యథా ప్రకారం నడుపుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యాసంస్థలు, తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే… అలాకూడా చేయొచ్చని తేల్చి చెప్పారు. దీనికికూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, యథాతథంగా తమ విద్యాసంస్థలను వారు నడుపుకోవచ్చని సిఎం ప్రకటించారు.
Must Read :ధాన్యం సేకరణకు పటిష్ట విధానం : సిఎం జగన్