ఆహార, వ్యవసాయ సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. భారత వాయు సేన కు చెందిన రెండు విమానాలు ఈ రోజు నానో యూరియా తో కొలంబో చేరుకున్నాయి. వంద టన్నుల నానో లిక్విడ్ యూరియా రాకతో శ్రీలంక ప్రభుత్వం, రైతాంగం భారత్ కు కృతజ్ఞతలు చెప్పాయి.
సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహిస్తున్న శ్రీలంక కొన్నేళ్లుగా ఇతర దేశాల నుంచి యూరియా దిగుమతుల్ని నిషేదించింది. నెల రోజుల కింద శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స యూరియా దిగుమతులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. యూరియా కొరత పెరిగి రైతులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు కొద్ది నెలలుగా నిత్యావసరాల ధరలు పెరగటం, వ్యవసాయ రంగం ఒడిదుడుకులకు లోను కావటం లంక ప్రజలను, ప్రభుత్వాన్ని భయాందోళనలకు గురిచేసింది.
అయితే పరిస్థితి చక్కదిద్దే క్రమంలో శ్రీలంక ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు భారత ప్రభుత్వం అత్యాధునిక పద్దతుల్లో తయారుచేసిన నానో యూరియా కొలంబో చేర్చింది. భారత రైతాంగం కోసం రూపొందించిన ద్రవ రూపంలోని నానో యూరియా కొద్ది రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో వాడకం మొదలైంది. కోరిన వెంటనే నానో యూరియా పంపిన ఇండియా తమ దేశ ప్రజలకు దీపావళి కానుకగా అందించిందని శ్రీలంక అభినందనలు వ్యక్తం చేసింది.