OUT Cricket Team Is Missing Proper Training As They Engaged In Busy Schedule :
మన దేశంలో క్రికెట్ తర్వాతే ఏ ఆటయినా. ఏ గల్లీ చూసినా క్రికెట్ వీరులు కనిపిస్తారు. గతంలో టెస్ట్ మ్యాచులు, వన్డే మ్యాచులు ఉన్నప్పుడే హడావుడి. ఇప్పుడో! వాటికి తోడు ఐపీఎల్, టీ 20 వరల్డ్ కప్ అదనం. కరోనా వల్ల ఆటగాళ్లు నెలల తరబడి బయో బబుల్ లో ఉండాల్సిన అవసరం. ఎక్కడా తగ్గేది లేదు. ఆట ఆగేదీ లేదు. ఫలితం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా ఒక చిన్న కథ గుర్తు చేసుకుందాం
ఒక ఊళ్ళో కట్టెలు కొట్టే యువకుడు ఉండేవాడు. చాలా నైపుణ్యంతో తక్కువ సమయంలో ఎక్కువ చెట్లు కొట్టేవాడు. అదే ఊళ్ళో ఒక పెద్ద కట్టెల అడితి ఉండేది. దాని యజమాని దగ్గరకెళ్ళి కట్టెలు కొట్టేవాడు ఉద్యోగం అడిగాడు. యజమాని కొత్త గొడ్డలి, ఉద్యోగం ఇచ్చాడు. మొదటి రోజు 18 చెట్లు కొట్టాడు. యజమాని మెచ్చుకున్నాడు. మనవాడు పొంగిపోయి మర్నాడు ఇంకా కష్టపడ్డాడు. కానీ 15 చెట్లే కొట్టగలిగాడు. ఆ మర్నాడు 14, 12 ..ఇలా రోజురోజుకీ కొట్టే చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. నిరాశ కమ్ముకుంది. శక్తి తగ్గిపోయిందేమో అనుకున్నాడు. యజమాని దగ్గరికెళ్లి క్షమాపణ అడిగాడు. సమస్య వివరించాడు. అంతా విన్న యజమాని ఒక మాట అడిగాడు’ గొడ్డలికి పదును పెట్టి ఎన్నాళ్ళయింది’ అని. అందుకు తీరికే లేదన్న పనివాడికి జ్ఞానోదయమైంది.
ఇప్పుడీ కథని ఇండియన్ క్రికెట్ ఆటగాళ్లకు ముడి పెట్టండి. వారి వైఫల్యానికి సమాధానం దొరుకుతుంది. వారికే కాదు, ప్రతి ఒక్కరికీ వర్తించే కథ ఇది. జీవనపోరాటంలో రకరకాల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, బాధ్యతల లో మునిగి తేలుతూ సమస్యలు ఎదురైతే దిక్కులు చూసే వారందరికీ ఆగి ఆలోచించాల్సిన సమయం. తమ నైపుణ్యాలు, ప్రావీణ్యతలకు పదును పెట్టి ఎన్నాళ్ళయిందని. నిత్యసాధన లేనిదే ఏ విద్యా రాణించదు. రకరకాల ప్రలోభాలు, ఒత్తిళ్లతో నిర్లక్ష్యం చేస్తే ఫలితం ఎలా బాగుంటుంది?ఎప్పటికప్పుడు మన అర్హతలు, నైపుణ్యం పెంచుకోవడమే ఆటగాళ్ళైనా, మరెవరైనా చేయాల్సింది.
Must Read :రవి శాస్త్రి స్థానంలో ద్రావిడ్ నియామకం