ICC T20 Wc India Out Of Tourney With Landslide Victory Against Namibia :
టి20 వరల్డ్ కప్ సూపర్ 12 పోటీలు నేటితో ముగిశాయి. చివరి మ్యాచ్ లో నమీబియాపై ఇండియా 9వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్ లో జడేజా, అశ్విన్, బుమ్రా రాణించగా, బ్యాటింగ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ మరోసారి తమ సత్తా చాటారు.
దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నమీబియాలో డేవిడ్ వీస్-26, ఓపెనర్ స్టీఫెన్ బార్డ్-21 మాత్రమే రాణించారు. ఆ తర్వాతి అత్యధిక స్కోరు భారత బౌలర్లు ఎక్స్ ట్రా పరుగుల రూపంలో సమర్పించుకున్న 17 పరుగులే కావడం గమనార్హం. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. జడేజా, అశ్విన్ చెరో మూడు; బుమ్రా రెండు వికెట్లు పడగొట్టారు.
ఆ తరవాత బ్యాటింగ్ కు దిగిన ఇండియా తొలి వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహూల్, సూర్య కుమార్ యాదవ్ లు రెండో వికెట్ పడకుండానే 15.2 ఓవర్లలోనే లక్ష్యం సాధించి పెట్టారు. రాహూల్ 36 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లతో 54, సూర్య కుమార్ యాదవ్ 19 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులతో అజేయంగా నిలిచారు.
నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
గత ఏడాది సెమీఫైనల్లో ఓడిపోయిన ఇండియా ఈసారి రెండో రౌండ్(సూపర్ 12)లోనే వెనుదిరగడం భారత క్రీడాభిమానులను ఒకింత నిరాశకు గురిచేసింది.
కాగా, టి 20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి ఇది చివరి మ్యాచ్, గెలుపుతో విరాట్ కు పొట్టి ఫార్మాట్ సారధిగా ఘనంగా వీడ్కోలు లభించింది.
ALSO READ: