Nobel Peace Prize Laureate Malala Yousafzai Is Getting married :
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ జీవన పయనంలో సరికొత్త అంకం ప్రారంభమైంది. అసర్ మాలిక్ అనే యువకుడితో యూసఫ్‌జాయ్ వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. బర్మింగ్‌హామ్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా మాలిక్‌తో ఆమె నిఖా జరిగింది. వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైంది. అసర్, నేను జీవిత భాగస్వాములమయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుక నిర్వహించాం. మాకు మీ ఆశీస్సులు కావాలి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణాన్ని కలసి సాగించడానికి ఆతృతగా ఉన్నాం’ అని ట్విట్టర్‌లో మలాలా పోస్టు చేశారు.
పాకిస్తాన్ ఖైభర్ పక్తుంక్వ రాష్ట్రంలోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా.. బాలిక విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. 2012లో మింగోర పట్టణంలో మలాలా చదువుతున్న పాఠశాల బస్సులోకి చొరబడి తాలిబాన్లు ఆమె మీద కాల్పులకు దిగారు. ఈ ఘటనలో మలాలా ఎడమ కణితి, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే పెషావర్‌కు తరలించి చికిత్స అందించండంతో ప్రాణాలు నిలిచాయి. బుల్లెట్ గాయాల కారణంగా మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం బ్రిటన్‌కు తరలించారు. పలు ఆపరేషన్ల తర్వాత మలాలా కోలుకున్నారు. అప్పటి నుంచి ఆమె బ్రిటన్‌లో తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. ఆడపిల్లల చదువు కోసం మలాలా చేసిన సేవల్ని గుర్తించి 2014లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని అందజేశారు. 17 ఏళ్ల అతిచిన్న వయసులోనే నోబెల్ అందుకున్న యువతిగా మలాలా గుర్తింపు పొందారు. 2020లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో ఆమె డిగ్రీ పట్టా పొందారు.
Also read : అడవి తల్లి ఆడబిడ్డ