నాలుగు బిల్డింగ్లు కనిపిస్తే అది అభివృద్ధి కాదని.. నిన్నటి కంటే ఈరోజు బాగుంటే అదే అభివృద్ధి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భావి తరాలు బాగు పడాలనే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న స్కూళ్ళు బాగు చేయడం అభివృద్ధి అని, ప్రపంచం తో పోటి పడేలా మన విద్యార్ధులకు ఆంగ్లంలో బోధన అందించడం అభివృద్ధి అంటారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జగన్ మాట్లాడారు.
విడ్ పరిస్థితుల్లో అర్ధ సత్యాలను ప్రసారం చేసి ప్రజలను భయాందోళనలకు గురిచేయవద్దని చంద్రబాబు, ఎల్లో మీడియాను కోరుతున్నట్లు జగన్ చెప్పారు. ఆడే గుండెను ఆపవద్దని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ పై పోరులో అందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష నేత లాగా తనకు 40 ఏళ్ళ అనుభవం లేకపోవచ్చు కానీ చిత్తశుద్ధితో, నిజాయతీగా పనిచేస్తున్నట్లు చెప్పారు. 23 నెలల పాలనలో కులం, మతం, ప్రాంతం, పార్టీ వివక్ష చూడకుండా అర్హులైన అందరికీ సంక్షేమం అందించామని వివరించారు.
కోవిడ్ పరిస్థితిని ఎవరూ ఊహించలేదని, అయినా సరే కోవిడ్ నియంత్రణలో మనం దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపామని వివరించారు. కోవిడ్ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన తొలిరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పారు. ఇప్పటి వరకూ మనం మంచినీరు మాత్రమే కొనుక్కున్నామని, కోవిడ్ తర్వాత ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదనతో చెప్పారు. కోవిడ్ వల్ల తల్లిదండులు కోల్పోయిన చిన్నారులను ఆడుకునేదుకు వారి పేరిట రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తున్నామని, దానిపై వచ్చే వడ్డీతో వారు జీవన సాగించేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 62శాతం జనాభా వ్యవసాయంపై బతుకుతున్నారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం అన్నారు. రైతులకు కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. పంచాయతీ భవనాలపై నీలం- ఆకుపచ్చ రంగుల్ని.. కుట్రలు పన్ని తుడిచేశారు కానీ జనం గుండెల్లో ఉన్న మా రంగులను తీసేయలేకపోయారని జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీ అడుగు పెట్టడానికి కూడా మొహం చెల్లకుండా విపక్షాన్ని ప్రజలు తుడిచేశారని ఎద్దేవా చేశారు.
మహానేత కోసం ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఓదార్పుయాత్రతో పరామర్శించానని, తనకు ప్రాణం విలువ బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అందుకే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఫోన్ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలా మార్పులు చేశామని, ప్రతి 2 వేలమంది జనాభాకు ఒక ఏఎన్ఎంను ఏర్పాటు చేశామని వివరించారు.