Kanpur Test:
న్యూజిలాండ్ తో జరుగుతోన్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా 7 వికెట్లకు 234 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది, 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. విజయానికి రేపు చివరి రోజు 90 ఓవర్లలో 280 పరుగులు చేయాల్సి ఉంది.
ఒక వికెట్ నష్టానికి 14 స్కోరుతో నేటి ఆట మొదలు పెట్టింది ఇండియా. మొదటి మ్యాచ్ లో సెంచరీతో రాణించిన శ్రేయాస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్ లో కూడా జట్టును ఆదుకున్నాడు, 65 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి వృద్ధిమాన్ సాహా 61; అక్షర్ పటేల్-28 పరుగులతో క్రీజులో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్-32;; పుజారా-22; మయాంక్ అగర్వాల్-17 పరుగులు చేశారు. కెప్టెన్ రహానే కేవలం నాలుగు పరుగులకే ఔట్ కాగా, రవీంద్ర జడేజా డకౌట్ అయ్యాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌతీ, కేల్ జేమిసన్ చెరో మూడు, అజాజ్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు.
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కివీస్ కు మూడో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది, రెండు పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్ యంగ్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ టామ్ లాథమ్-2, సోమర్ విల్లె-0 పరుగులతోను క్రీజులో ఉన్నారు.