సి బి ఎస్ ఈ 12 వ తరగతి పరీక్షల నిర్వహణపై జూన్ 1 న తుది నిర్ణయం తీసుకుంటారు. భారత రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన, కేంద్ర విద్యా శాఖా మంత్రి రమేష్ పోక్రియాన్ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశం నేడు ఆదివారం నాడు వర్చువల్ పద్ధతిలో జరిగింది. కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్, కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు. ఎక్కువ రాష్ట్రాలు పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపగా కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ అసాధ్యమని స్పష్టం చేశాయి.
మే 25వ తేది లోగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ సలహాలను కేంద్రానికి పంపాలని రాజ్ నాథ్ సింగ్ కోరారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరిక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రాల సూచనలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
విద్యార్ధులు, ఉపాధ్యాయుల భద్రత, ఆరోగ్యం, భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని రమేష్ పోక్రియాల్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అందరి సలహాలు పరిగణన లోకి తీసుకొని ఓ ఆమోదయోగ్యమైన నిర్ణయం అతి త్వరలో వెల్లడిస్తామని, విద్యార్ధుల్లో నెలకొన్న ఆందోళన తొలగిస్తామని హామీ ఇచ్చారు.
సి బి ఎస్ ఈ బోర్డు రెండు ప్రతిపాదనలను సమావేశం ముందు పెట్టింది. మొదటిది కేవలం ముఖ్యమైన సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించి మిగిలిన వాటికి ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా మార్కులు కేటాయించడం, రెండవది పరీక్షా సమయాన్ని కుదించడం. ఈ ప్రతిపాదనలపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్పనున్నాయి.