German Investment Summit:
భారతదేశంలో 28 మినీ ఇండియాలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. దేశంలో ప్రతి 150 కిలోమీటర్లకూ స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, 22 అధికారిక భాషలు ఉంటే, అనధికారికంగా 300 భాషలు ఉన్నాయని అయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్, తాజ్ కృష్ణ హోటల్ లో జర్మన్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కేటీఆర్, ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్, ఇండియాలో జర్మన్ రాయబారి వాల్టర్ జె లిండర్ హాజరయ్యారు. సదస్సులో జర్మన్ సంస్థ Lite Auto GmbH తో తెలంగాణా ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. 1500 కోట్ల రూపాయల పెట్టుబడులతో 100 ఎకరాల్లో ఆటో మొబైల్ పరిశ్రమను Lite Auto GmbH స్థాపించనుంది.
ఈ సందర్భంగా కేటియార్ మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి పెట్టుబడిదారుల కష్టాలు క్షుణ్ణంగా తెలుసని, వాటిని తొలగించేందుకే సరళమైన విధానంతో టీఎస్ ఐపాస్ ని ప్రవేశపెట్టామని, దీని ద్వారా అన్ని సర్టిఫికెట్లు ఉన్నవాళ్ళకి 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని, ఇలాంటి పాలసీ దేశంలో మరెక్కడా లేదని స్పష్టం చేశారు. ఈ పాలసీ ద్వారా 17,500 కంపెనీలకు 15 రోజుల్లోపే అనుమతులు ఇచ్చామని, పరిశ్రమల స్థాపన కోసం 2వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ రెడి గా ఉందని వెల్లడించారు. TSIIC ద్వారా ల్యాండ్ కేటాయిస్తున్నామని, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ని అందిస్తున్నామని వివరించారు. తెలంగాణలో 1500 కోట్లు ఇన్వెస్ట్ చేసిన Lite Auto GmbH సంస్థ కి అభినందనలు తెలిపారు.
జర్మనీ జిడిపిలో 80% చిన్నతరహా పరిశ్రమల నుంచే వస్తుందని, మనదేశంలో కూడా అలాంటి పరిస్థితి రావాలని కేటియార్ అభిప్రాయపడ్డారు. జర్మనీ పారిశ్రామికవేత్తలను కలుసుకోవడం ఆనందంగా ఉందన్న మంత్రి త్వరలో హైదరాబాద్ నుంచి జర్మనీకి ప్రత్యేక ఫ్లైట్ సర్వీస్ ప్రారంభం కానుందని వెల్లడించారు.
Lite Auto GmbH డైరెక్టర్ బాలా ఆనంద్ మాట్లాడుతూ త్వరలోనే సంస్థను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 200 మిలియన్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని ప్రకటించారు. తమ సంస్థ ద్వారా తొమ్మిది వేల మందికి ప్రత్యక్షంగా, 18 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఫ్రెండ్లీ వాతావరణం ఉందని, ఏరో స్పేస్ కి కావాల్సిన టాలెంట్ ఉన్న యువత తెలంగాణలో ఉన్నారని అయన సంతోషం వ్యక్తం చేశారు .
Also Read : సీలింగ్ ల్యాండ్ ఉంది: మెదక్ కలెక్టర్