12B Status to Satavahana:
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి 12-బి హోదాను త్వరగా కల్పించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ యూజీసీ కి విజ్ఞప్తి చేశారు. నేడు న్యూఢిల్లీలో యూజీసీ కార్యదర్శి, సిఈవో రజినీష్ జైన్ ను కలుసుకొని ఈ మేరకు ఓ వినతిపత్రం సమర్పించారు. 12-బి హోదా కల్పించే విషయమై గతంలో తాను చేసిన వినతి మేరకు ప్రత్యేకంగా కమిటీని నియమించడంపట్ల రజ్నీష్ జైన్ కు సంజయ్ ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల స్వతంత్రతను దెబ్బతీసేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రభుత్వ అనుమతి లేనిదే విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి నియామకాలు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దీనిలో భాగమేనని అయన యుజిసి దృష్టి కి తీసుకెళ్ళారు. విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించచడం లేదని, దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని అయన ఆందోళన వ్యక్తం చేశారు.
శాతవాహన యూనివర్శిటీకి 12(బి) హోదా లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కావాల్సిన నిధులు సమకూరడం లేదని, మారిన నిబంధనలతో యూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని యూజీసీ కార్యదర్శికి వివరించినట్లు బండి పేర్కొన్నారు. తన వినతిపట్ల సానుకూలంగా స్పందించిన రజ్నీష్ జైన్ వెంటనే రికగ్నిషన్ కమిటీ ఛైర్మన్ తో ఫోన్ లో మాట్లాడారని, శాతవాహన వర్శిటీకి 12-బి హోదా ఇచ్చే విషయంపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారని బండి ఓ ప్రకటనలో వెల్లడించారు. 12-బి స్టేటస్ లభిస్తే అధ్యాపక, బోధనేతర సిబ్బంది నియామకాల్లో సమస్యలు తొలగిపోతాయని. యూనివర్సిటీకి అవసరమైన నిధులు సమకూరుతాయని బండి విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read :త్వరగా పూర్తి చేయండి: కెసియార్