ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సైనికుడు సాయి తేజ దేశానికి అందించిన సేవలు మరువలేనివని, సిఎం జగన్ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి వెల్లడించారు. నేడు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం .హరినారాయణన్ ల తో కలసి కురబలకోట మండలం రేగడపల్లిలో సాయి తేజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయితేజ చిత్ర పటానికి నివాళి అర్పించారు.
దేశ రక్షణరంగంలో విశిష్టమైన సేవలను సాయి తేజ అందించారని, వారి సేవలను ఎన్నటికి మరవలేమని, విలువ కట్టలేనివని చెప్పారు. ప్రభుత్వం తరఫున వారి కుటుంబానికి యాభై లక్షల రూపాయల చెక్కును అందించారు. సాయి తేజ సతీమణి కి ఉద్యోగం కావాలని కోరారని, ఈ విషయాన్ని సిఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఆయన చేసిన సేవ ముందు మనం ఎంత చేసినా తక్కువే అవుతుందని వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Also Read : ఆర్మీ హెలికాప్టర్ ఘటనలో ఏపీ వాసి మృతి