Sunday, September 22, 2024
HomeTrending Newsకొనుగోళ్లు పూర్తైన వెంటనే రైతులకు డబ్బులు

కొనుగోళ్లు పూర్తైన వెంటనే రైతులకు డబ్బులు

Grain Purchases  : ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, గత ఏడు కంటే 30శాతం అధికంగా ఈరోజు వరకూ ధాన్యం సేకరణ చేశామని, వీటికి నిధుల కొరత లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. హైదరాబాద్ లో ఈ రోజు సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులతో తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ధాన్యం కొనుగోళ్లలో గత సంవత్సరం ఇదే రోజు కన్నా దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఏడు అధికంగా కొనుగోలు చేశామని, ఇప్పటికే పదమూడు జిల్లాల్లో 1280 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయి మూసివేసామన్నారు. 5447 కోట్లను ఇప్పటికే రైతుల అకౌంట్లలో వేశామన్న మంత్రి, ఓపీఎంఎస్లో నమోదైన వెంటనే రైతుల అకౌంట్లలో నిధుల్ని జమచేస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. ఇప్పటివరకూ 6775 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేపడుతున్నామని, నిన్నటి వరకూ 42.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసామని, వీటి విలువ 8268 కోట్లన్నారు. ఒపీఎంఎస్లో నమోదైన 4 లక్షల 50వేల మంది రైతులకు గానూ 3 లక్షల 75వేల మందికి పేమెంట్ సైతం పూర్తి చేసామన్నారు, ట్రాన్స్ పోర్టు, గన్నీల కొరత లేదన్నారు. కరోనా సంక్షోభంలోనూ వానాకాలం వడ్ల కొనుగోళ్లు నిరంతరాయంగా చేస్తున్నామని మంత్రి గంగుల వివరించారు.

ఎఫ్.సి.ఐ గోదాములు తెలంగాణలో దాదాపుగా అన్నీ నిండిపోయాయని, ముఖ్యంగా సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్లో గోదాములు పూర్తిగా నిండిపోయాయని మిగతా చోట్ల సైతం నిలువ కొరత వేదిస్తుందన్నారు. ఎఫ్.సి.ఐ గోదాములను, గోడౌన్లను లీజుకు తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనికి తోడు సరైన సమయానికి ర్యాక్ లు పంపకపోవడంతో గోదాముల నుండి భియ్యం తరలింపు జరగడం లేదని, దీంతో మిల్లుల్లో ఉన్న బియ్యాన్ని ఎఫ్.సి.ఐ గోదాముల్లోకి తీసుకోలేకపోతుందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్.సి.ఐ కు విజ్ణాపన లేఖలు పంపిందని, ఐనా ఎలాంటి స్పందనా లేదన్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వానాకాలం ధాన్యం సేకరణను వేగవంతంగా చేస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Also Read : ధాన్యం సేకరణపై కేంద్రం పూటకో మాట

RELATED ARTICLES

Most Popular

న్యూస్