AnilKumar Slams Heroes : కొందరు హీరోలకు సినిమా టికెట్ ధరలు తగ్గడం కంటే తమ రెమ్యునరేషన్ తగ్గుతుందనే ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలకు మొత్తం అయిన ఖర్చు ఎంత, పవన్ కళ్యాణ్ పారితోషికం ఎంతో చెప్పాలని అనిల్ డిమాండ్ చేశారు. ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పుకుంటున్న పవన్ తన పారితోషికం తగ్గించుకోవచ్చుగా అని ప్రశ్నించారు. అభిమానుల్లో తనకున్న క్రేజ్ ను పవన్ క్యాష్ చేసుకుంటున్నారని, అయన 50 కోట్లు పారితోషికం తీసుకునే బదులు 10 కోట్లు తీసుకుంటే సరిపోతుందిగా అని వ్యాఖ్యానించారు. నిర్మాతకు మొత్తం సినిమా ఖర్చులో 80 శాతం హీరోల రెమ్యునరేషన్ కే పోతోందన్నారు. నిర్మాతలు వాళ్లకు ఏవైనా సమస్యలుంటే వచ్చి చెప్పుకోవాలన్నారు.
హీరో నానిపై కూడా అనిల్ మండిపడ్డారు. అయన ఓ భజన పరుడని, అయన గురించి మాట్లాడ్డం ఎందుకు అంటూ వ్యాఖ్యానించారు. తనకు తెలిసింది ఒకే నాని అని అది కొడాలి నాని అని, ఆ తర్వాత పేర్నినాని, ఆళ్ళ నాని అని వ్యంగ్యంగా చెప్పారు. తాము కూడా బండ్లు తాకట్టు పెట్టి, హీరోలకు కటౌట్లు పెట్టించి, పూల దండలు వేసి హడావుడి చేసిన సందర్భాలున్నాయని, ఆ స్థాయి నుంచే తాము వచ్చామన్నారు.
Also Read : ధరలు నియంత్రిస్తే అవమానించడమా: బొత్స