Chaitanya Ratham-E-paper: ఇటీవలి కాలంలో మీడియాకు కూడా కులం ముద్ర వేసి వేధిస్తున్నారని, మరి కొంతమందిని బెదిరించి లోబరచుకునే పరిస్థితికి వచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ నేతలను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, అయినా సరే ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఆందోళనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చైతన్య రథం – ఈ-పేపర్ పేరుతో తెలుగుదేశం పత్రికను చంద్రబాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ చైతన్య రథం అనగానే అన్న ఎన్టీఆర్, నాటి పోరాట స్ఫూర్తి గుర్తుకు వస్తాయని అందుకే తమ ఈ-పేపర్ కు పేరు అదే పెట్టామని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలకు అసలైన సమాచారం ఇస్తూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. మీడియాకు తాము పోటీ కాదని… తమ కార్యకర్తల పోరాటానికి అవసరమైన సమాచారాన్ని అందించే ప్రయత్నమే చేస్తున్నామని వివరించారు. రెండు రాష్ట్రాల్లో 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, వారందరినీ క్రియాశీలం చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తెప్పించుకొని దాన్ని అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ-పేపర్ పెడుతున్నామని చెప్పారు. ప్రజాహితం కోరుకునేవారు, రాష్ట్ర శ్రేయస్సు కోరుకునేవారు సహకరించాలని కోరారు.
మీడియా రంగంలో అనేక సరికొత్త మార్పులు వస్తున్నాయని చెప్పారు. ఒక చిన్న క్లిక్ తో లక్షలాది మందికి సమాచారం పంపే అవకాశం వచ్చిందన్నారు. సామాజిక మాధ్యమాలు నేటి సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. రాజకీయ పార్టీగా తమ పని తాము చేయాలని, పత్రికలు వాటి పని అవి చేస్తాయన్న ఉద్దేశంతో ఎప్పుడూ పత్రికలు పెట్టాలన్న ఆలోచన రాలేదని వివరించారు.
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. ఆర్ధికంగా మనం ఎక్కడ ఉన్నామో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఈ అప్పులకు వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి మరోవైపు అభివృద్ధి కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందుకే ఈ పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మేధావులనుంచి సామాన్య ప్రజలు ప్రజల వరకూ అందరూ పోరాటాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : ధరలు దిగిరావాలి- జగన్ దిగిపోవాలి