UP- Another Minister resigned: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నిన్న యోగి కేబినేట్ లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా బిజెపికి గుడ్ బై చెప్పి మౌర్య నేతృత్వంలో ఎస్పీ లో చేరుతున్నట్లు వెల్లడించారు.
కాగా నేడు మరో మంత్రి ధారా సింగ్ చౌహాన్ కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. యోగి కేబినేట్ లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా పని చేశారు. చౌహాన్ రాజీనామాతో మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపికి రాజీనామా చేసినట్లయ్యింది. చౌహాన్ బలమైన ఓబీసీ నేతగా గుర్తింపు సాధించారు. తొలుత బీఎస్పీలో పనిచేసిన చౌహాన్ ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, లోక్ సభ సభ్యుడిగా పనిచేశారు. 2015 లో నాటి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. వెంటనే బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2017యూపీ ఎన్నికల్లో మధుబన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై యోగి మంత్రివర్గంలో చేరారు.
తన బాధ్యతను చిత్తశుద్ధితో, అంకిత భావంతో నిర్వహించానని, కానీ దళితులు, నిరుద్యోగులు, వ్యవసాయదారులు, వెనుకబడిన తరగతులు, పీడిత వర్గాల పట్ల యోగి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు దారా సింగ్ చౌహాన్ ప్రకటించారు.