రాష్ట్ర వ్యాప్తంగా 50 పడకల సామర్థ్యం కలిగిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వారం రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, కరోనా నియంత్రణకు రాష్ట్ర పభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణమని తెలిపారు. వ్యాక్సినేషన్ సందర్భంగా టీకా దుర్వినియోగమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ నివారణకు గుర్తించిన ఆసుపత్రుల్లో వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ఆర్డర్లు పెట్టినా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రాలకు ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు సరఫరా అవుతున్నాయన్నారు. ఈరోజు వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి 7,726 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు వస్తే.. వాటిని జిల్లాలకు సరఫరా చేశామన్నారు.
సూపర్, మల్టీ సెప్సాల్సిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సంబంధించిన విధి విధానాలను రెండు వారాల్లో వెల్లడిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వరూ 66 విజిలెన్స్ కేసులు నమోదు చేశామని, వాటిలో 43 కేసులకు పెనాల్టీ విధించామన్నారు. ఈ 43 కేసుల్లో పెనాల్టీ పది రెట్లు అధికంగా విధించామన్నారు. మిగిలిన 23 కేసులకు సంబంధించి పెనాల్టీపై నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. కొవిడ్ వల్ల తల్లిదండ్రులు మృతిచెందడంతో అనాథలైన చిన్నారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారికి ఆర్థిక ఇబ్బందులు, చదువుకు ఇక్కట్లు రాకుండా నెల నెలా ఫిక్సడ్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ చెల్లిస్తామన్నారు