Gas Insulated Sub Station: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా నగరం నలువైపులా విద్యుత్ వ్యవస్థ ను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి. జగదీశ్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని రాయదుర్గంలో ఏర్పాటు చేస్తోన్న 400 కేవీ గ్యాస్ ఇన్సూలేటెడ్ సబ్ స్టేషన్ పనులను ట్రాన్స్ కో, జెన్కో సిఎండి ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ఇదేనని చెప్పారు. హైదరాబాద్ నగరంలో రాబోయే 30,40 సంవత్సరాల అవరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వ్యవస్థ ను నెలకొల్పుతున్నామన్నారు. హైదరాబాద్ నగరానికి విద్యుత్ వలయం ఏర్పాటు చేశామని, దీని ద్వారా రెప్పపాటు సమయం కూడా విద్యుత్ కోతలు ఉండవని హామీ ఇచ్చారు.
రింగ్ రోడ్ చుట్టూ 400 కెవి, 220 కెవి, 133 కెవి, 33 కెవి సామర్ధ్యంతో నాలుగు సబ్ స్టేషన్లు ఏర్పాటు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేశామని జగదీశ్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి వీటి ఏర్పాటుకు దాదాపు 100 ఎకరాల స్థలం అవసరమై ఉండేదని, కానీ 5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశామని అదే దీని ప్రత్యేకతగా మంత్రి వివరించారు.
ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ టీఎస్ ట్రాన్స్ కో ఆధ్వర్యంలో నిర్మాణం చేశామని, పనులు చాలా వేగంగా జరిగాయని, కోవిడ్ తోపాటు అనేక ఆటంకాలు తట్టుకొని పనులు పూర్తి చేశారని మంత్రి అధికారులకు కితాబిచ్చారు. దీని ద్వారా నగరానికి మరో 2000 మెగా వాట్స్ విద్యుత్ సరఫరా చేయవచ్చని వివరించారు. 1400 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ను త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభిస్తారని జగదీశ్ రెడ్డి తెలిపారు.
Also Read : ఎమ్మెల్సీలుగా కవిత, దామోదర్ రెడ్డి ప్రమాణం