కరోనా విషయంలో ప్రభుత్వ చర్యలపై తెలంగాణా హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలు నిర్ణయించి కొత్త జిఓ ఎందుకు ఇవ్వలేదని, కరోనాపై సలహా కమిటీ ఏర్పాటు చేయాలని సూచించినా ఎందుకు అమలు చేయలేదని న్యాయస్థానం ప్రభుత్వాన్ని నిలదీసింది.
కరోనా మూడో వేవ్ ఎదుర్కొనేందుకు ఏయే చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మహారాష్ట్రలో 8 వేలమంది చిన్నారులకు కరోనా సోకినా విషయం మీ దృష్టికి వచ్చిందా అని అడిగిన హైకోర్టు…. ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని అభిప్రాయపడింది. అన్నీ భవిష్యత్ లోనే చేస్తారా ఇప్పుడేమీ చేయరా అంటూ అసహనం ప్రదర్శించింది.
కొంతమంది కరోనా బాధితులు బంగారం తాకట్టుపెట్టి చికిత్స తీసుకుంటున్నారని, ప్రైవేటు ఆస్పత్రులపై ఫిర్యాదులు అందాయని కోర్టు వెల్లడించగా… కొన్ని ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేసిన విషయం ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. బాదితులకు డబ్బులు తిరిగి ఇచ్చారా అంటూ తిరిగి ప్రభుత్వాన్ని అడిగింది.
హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరగా గతంలో తాము అడిగిన వివరణల్లో ఏ ఒక్కదానికీ సరైన సమాధానం ఇవ్వలేదని బదులిచ్చింది.
ఈరోజు హైకోర్టుకు నివేదిక సమర్పించిన ఆరోగ్య శాఖ డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొంది. రేపు హైకోర్టుకు ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్, రాష్ట్ర డిజిపి హాజరు కావాలని ఆదేశించింది.