అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం సమర్థవంతంగా ఉండాలని, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ అనుబంధ రంగాల ప్రాజెక్టుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారులకు సూచించారు.
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ తయారు చేయాలని జగన్ ఆదేశించారు. అదే విధంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్భర్ అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన నిర్దేశించారు.
అమూల్ పాల సేకరణ పురోగతిపైనా ముఖ్యమంత్రి ఆరాతీశారు. గత ఏడాది నవంబరు 20వ తేదీన ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో అమూల పాల సేకరణ మొదలు పెట్టగా, ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 29న గుంటూరు జిల్లాలో, ఏప్రిల్ 3న చిత్తూరు జిల్లాలోని మరి కొన్ని గ్రామాలకు పాల సేకరణ విస్తరించారు. ఈనెల 4వ తేదీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమూల్ పాల సేకరణ మొదలు పెడుతోంది.
నాలుగు జిల్లాలలో 12,342 మంది మహిళా రైతుల నుంచి 50.01 లక్షల లీటర్ల పాలు సేకరించిన అమూల్, వారికి రూ.23.42 కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది. విధంగా రాష్ట్రంలో మహిళా రైతులకు రూ.3.91 కోట్లు అదనంగా ఆదాయం లభించింది.
.