కేసీఆర్ 20 ఏళ్లుగా ఎందరో నాయకులను తయారు చేశారని, వారిలో ఈటెల రాజేందర్ ఒకరని శాసన మండలి ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ కమ్యూనిజం ఎక్కడ పోయిందని…. బిజెపి నాయకుల దగ్గర తాకట్టు పెట్టారా అంటూ సూటిగా ప్రశ్నించారు. నీ ఆత్మ ఎక్కడ ఉంది? నీ గౌరవం ఎక్కడ ఉంది అంటూ పల్లా ఈటెలను నిలదీశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటెలకు ఎంతో గౌరవం ఇచ్చారని, ఎన్నో పదవులు కట్టబెట్టారని, కానీ విశ్వాసం లేకుండా సొంత ప్రభుత్వ పథకాలనే అయన విమర్శించారని రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.
పార్టీ మీద నమ్మకం, నాయకుడి మీద నమ్మకం లేకుంటే చెప్పాలి కానీ ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా ఉంటూ విమర్శలు చేస్తారా అంటూ ఈటెలను దుయ్యబట్టారు. ఈటెలను అందరూ ఛీ కొడుతున్నారన్నారు.
ఈటెల క్షమించరాని నేరం చేశారని, దానికి పార్టీపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని, ఎప్పుడనే దానిపై మా పార్టీ అధినేత కెసియార్ నిర్ణయం తీసుకుంటారని పల్లా వివరించారు. రాజేందర్ తన రాజకీయ సమాధిని తానె కట్టుకున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయనకు సిగ్గు అనిపించడం లేదా అని పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేంద్రంలో బీజేపీకి పరిపాలన చేతగాకే దేశ జిడిపి పడిపోయిందని, ఇది సిగ్గు చేటని మండిపడ్డారు.
ఇలా అబద్ధాలు మాట్లాదబట్టే గ్రాడ్యుయేట్ లు బిజెపికి తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ వెనక్కి పోలేదని, చెప్పింది చేసిచూపారని వివరించారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.