మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం లభించాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత. చివరి మజిలీని ప్రశాంతంగా నిర్వహించడం కనీస మర్యాద, కృతజ్ఞత. రాష్ట్రంలో ఏ కారణం వల్లనైనా మరణించిన వ్యక్తి పార్థివ దేహానికి గౌరవంగా అంత్యక్రియలు జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసింది. సామాన్యుడి వేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా.. పార్థివ దేహాలను నిల్వ చేయడం, పోస్ట్‌మార్టమ్ నిర్వహించడం, పార్థీవ రథాల ద్వారా భౌతిక కాయాన్ని ఇంటి వద్దకు చేర్చడం, అనంతరం గౌరవంగా ఖననం చేయడానికి చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకనుగుణంగా ఈ క్రమంలో ఇప్పటికే ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేయగా, అన్ని పట్టణాల్లో వైకుంఠ ధామాల ఏర్పాటు వేగంగా సాగుతున్నది. మృతదేహాలను తరలించేందుకు వైకుంఠ రథాలను ఏర్పాటు చేసింది.
ఇప్పుడు మార్చురీల ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఒకప్పుడు మార్చురీలు కనీస వసతులు లేక దారుణంగా ఉండేవి. ముక్కు మూసుకొని విధులు నిర్వహించాల్సిన దుర్భర పరిస్థితి. మృతుల బంధువులు విదేశాల నుంచి రావాల్సి ఉంటే.. పార్థివ దేహాలను నిల్వ చేసేందుకు కూడా వసతులు లేవు. దీంతో కడసారి చూపు దక్కని సందర్భాలు ఎన్నో.. ఈ పరిస్థితిని మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్చురీ లను ఆధునీకరిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 113 చోట్ల మార్చురీలు ఉన్నాయి. వాటిల్లో అవసరమైన పరికరాలు, ఫ్రీజర్లు, అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మార్చురీల్లో అన్ని రకాల వసతులు కల్పించేలా నూతన మార్చురీ విధానాన్ని అమలు చేసేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 32.54 కోట్లు విడుదల చేసింది. ఇందులో 10 టీచింగ్ ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు రూ.11.12 కోట్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 51 దవాఖానల్లో మర్చూరీల ఆధునికీకరణకు రూ. 21.42 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. హైదారాబాద్ లోని ఉస్మానియా, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రులతో పాటు మహబూబ్ నగర్, నల్గొండ సూర్యాపేట, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, అదిలాబాద్ బోధనాసుపత్రులు ఇందులో ఉన్నాయి.
తెలంగాణ రాకముందు వైద్య కళాశాలల్లో మాత్రమే ఫోరెన్సిక్ నిపుణులు ఉండేవారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని మార్చురీ కేంద్రాల్లో ఫోరెన్సిక్ నిపుణులను నియమిస్తున్నది. వైద్యవిధాన పరిషత్తు దవాఖానల్లో 102 ఫోరెన్సిక్ నిపుణుల పోస్టులు మంజూరు చేసింది. ఇందులో 63 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 20 డీసీఎస్, 19 సీఎస్ పోస్టులు ఉన్నాయి.
గతంలో ఎవరైనా దవాఖానల్లో మరణిస్తే.. ఆ పార్థివ దేహాలను సొంతూళ్లకు తీసుకెళ్లడం పెద్ద సమస్యగా ఉండేది. మృతదేహాలను తీసుకెళ్లేందుకు ప్రైవేట్ వాహనదారులు సాధారణ చార్జీ కన్నా ఐదారు రెట్లు అధికంగా వసూలు చేసేవారు. దీంతో ఆయా కుటుంబాలకు ఆర్థికంగా భారం పడేది. ఈ కష్టాన్ని, వేదనను మనసుతో అర్థం చేసుకున్న ప్రభుత్వం.. పార్థివ దేహాలను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చింది. ప్రస్తుతం 50 వాహనాలు ఉండగా.. మరో 16 నూతన వాహనాలను త్వరలో ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి.
Also Read : ఉపాధి హామీకి కేంద్రం తూట్లు – మంత్రి ఎర్రబెల్లి