ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఇంకా పెండింగ్ లో ఉన్నవాటిని బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని టీఆర్ఎస్, చేవేళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హామీల మేరకు తెలంగాణలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించినందున శుక్రవారం లోక్‌సభలో ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణకు ప్రతిపాదన చేసినట్టు పేర్కొన్నారు.
లోక్‌సభ, రాజ్యాసభ వేదికగా తాము ఎన్నిసార్లు కేంద్రంపై ఒత్తిడి చేసినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం భూమి అందించడానికి ముందుకొచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రక్రియా ముందుకు సాగడం లేదని గుర్తు చేశారు. విభజన చట్టం అమలైనప్పటి నుంచి 10 ఏళ్లలోపు హామీలు అమలు చేయాల్సి ఉందని నొక్కి చెప్పారు. ఇప్పటికే చట్టం అమల్లోకి వచ్చి ఏనిమిదేళ్లు అయినా కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీల అమల్లో కేంద్రం చురుగ్గా వ్యవహరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించేవరకు తాము పోరాడుతామని రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు.