Statue of Equality: శంషాబాద్ లోని జియర్ స్వామి ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. రామానుజస్వామి సహశ్రాభ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల శ్రీ రామానుజ విగ్రహాన్ని ప్రధాని చేతుల మీదుగా లోకార్పణ చేశారు. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీ ఆధ్వర్యంలో ఆ వేడుక జరిగింది. రామానుజ చరిత్రను వివరిస్తూ త్రీ డీ మ్యాపింగ్, లేజర్ షో నిర్వహించారు. రామానుజ విగ్రహానికి ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో విశ్వక్షేనుడి ఇష్టి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశ్వక్షేనుడికి హారతి ఇచ్చారు. విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 108 దివ్య క్షేత్రాలను కూడా మోడీ దర్శించుకున్నారు. వైభవోపేతంగా లక్ష్మీ నారాయణ మహా క్రతువు జరిగింది. శ్రీ లక్ష్మీ నారాయణ యజ్ఞ హోమం పూర్ణాహుతిలో మోడీ పాల్గొన్నారు. 5వేల మంది రుత్వికులు ప్రధానికి ఆశీర్వచనం అందించారు. జై శ్రీమన్నారాయణ నినాదాలతో దివ్యక్షేత్రం మార్మోగింది.
రామానుజుల వారి విశిష్టాద్వైతం మనందరికీ ఆదర్శమని వసంత పంచమి శుభదినం రోజున సరస్వతీ దేవి కృపతో రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషమని మోడీ అన్నారు. ఈ కార్యక్రమం తన చేతుల మీదుగా జరగడం తాను చేసుకున్న అదృష్టమన్నారు, ఈ కార్యక్రమంలో మోడీ వెంట తెలంగాణా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, జూపల్లి రామేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.