Yuva Bharath: యువ ఇండియా ఐదోసారి క్రికెట్ ఐసిసి అండర్ 19 వరల్డ్ కప్ గెల్చుకుంది. వెస్టిండీస్, ఆంటిగ్వా నార్త్ సౌండ్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ పై నాలుగు వికెట్లతో విజయం సాధించి 2022 అండర్ 19 ట్రోఫీ సాధించింది, 2000, 2008, 2012, 2018 సంవత్సరాల్లో అండర్ 19 కప్ గెల్చుకున్న ఇండియా నేడు ఐదోసారి కప్ గెల్చుకొంది. బౌలింగ్ లో రవికుమార్, రాజ్ బవా సత్తా చాటగా, బ్యాటింగ్ లో షేక్ రషీద్, నిశాంత్ సింధు రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
విజయం కోసం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ ఇండియా పరుగుల ఖాతా తెరవకముందే రఘువంషి వికెట్ కోల్పోయింది, 49 వద్ద మరో ఓపెనర్ హర్నూర్ సింగ్ (21) కూడా ఔటయ్యాడు. షేక్ రషీద్ అర్ధ సెంచరీ చేసిన తరువాత ఔటయ్యాడు. మంచి ఫామ్ లో ఉన్న కెప్టెన్ యష్ ధూల్ నిరాశపరిచి 17 పరుగులే చేసి వెనుదిరిగాడు. బౌలింగ్ లో సత్తా చాటిన రాజ్ బవా బ్యాటింగ్ లో కూడా రాణించి అర్ధ సెంచరీ చేశాడు, 47.4 ఆరు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి లక్ష్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోషువా బాయ్డెన్, జేమ్స్ సేల్స్, థామస్ ఆస్పిన్ వాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ బెతేల్ (2)ను రవి కుమార్ ఎల్బీగా ఔట్ చేశాడు. స్కోరు 18 వద్ద వన్ డౌన్ లో వచ్చిన టామ్ ప్రీస్ట్ కూడా రవి కుమార్ బౌలింగ్ లోనే బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఆట 13వ ఓవర్లో రాజ్ బవా రెండు వరుస బంతుల్లో విల్ లక్స్ టన్(4); జార్జ్ బెల్ (0) లను అవుట్ చేసి ఒత్తిడి పెంచాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్ళలో జేమ్స్ ర్యూ-95 (116 బంతులు; 12 ఫోర్లు); జేమ్స్ సేల్స్-35 రాణించారు. ఇంగ్లాండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో రాజ్ బవా ఐదు, రవికుమార్ నాలుగు వికెట్లు, కౌశల్ తంబి ఒక వికెట్ పడగొట్టారు.
ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన రాజ్ బవా కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కగా, ఈ టోర్నీ లో అత్యధికంగా 506 పరుగులు చేసిన డివాయిడ్ బ్రెవీస్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ సాధించాడు.
Also Read: ప్రొ కబడ్డీ: ముంబై, యూపీ, హర్యానా విజయం