Special Status: పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యమైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడంలో ఉన్న ఇబ్బంది ఏమిటని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బిజెపి చెబుతున్న కారణాలు సహేతుకం కాదని అన్నారు. ఇప్పటికైనా హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విజయసాయి మాట్లాడారు.
ఏపీకి హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాల నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని స్పష్టం చేశారు. ఈ విషయమై ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరామని, కానీ కేంద్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని అయన ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణతోనే ఉందని, 2020-21లో కేంద్ర ద్రవ్య లోటు 6.9 ఉంటే రాష్ట్ర ద్రవ్య లోటు 3.9మాత్రమే ఉందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఏపీ ప్రజలను శిక్షించడం భావ్యం కాదని అయన వాపోయారు.
ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారం తయారు చేసిందని, అందుకే విభజనతో నష్టపోయిన ఏపీ ఇన్ని ఇబ్బందులు ఎడుర్కొవాల్సివస్తుందని విజయ సాయి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ సమస్యలకు కాంగ్రెస్ పార్టీ కూడా కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ప్రతిపాదించిన విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయి గుర్తు చేశారు.
Also Read : రాజ్యసభలో టిడిపి వర్సెస్ వైసీపీ