Devotional Yatra: తాను ప్రజలకు దత్తపుత్రుడినని, ఏ పార్టీకి కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల సిఎం జగన్ తో పాటు వైసీపే నేతలు పవన్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై జనసేన మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ స్పందించారు. వారి వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయన్నారు.
ఉద్యోగుల సమస్య తమ పార్టీయో, ఇతర విపక్షాలో సృష్టించింది కాదని, అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోగా సీపీఎస్ రద్దు చేస్తామని, జీతాలు పెంచుతామని వైఎస్ జగన్ స్వయంగా హామీ ఇచ్చిన విషయాన్ని అయన గుర్తు చేశారు. పీఆర్సీని అమలు చేయమనే ఉద్యోగులు అడుగుతున్నారని, దీనిపై పలుసార్లుగా చర్చలు జరిగి ఆ తర్వాత ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణకు వెళితే దానిపై తమను నిందించడం భావ్యం కాదన్నారు. వైసీపీ నేతలు ఏం చేసినా డూ డూ బసవన్నలుగా ఉండాలని లేకపోతే సుప్రీం కోర్టు న్యాయమూర్తి నుంచి నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ఆందోళన చేస్తున్న ఉపాద్యయుల వరకూ ఎవరిపైనైనా వారు విమర్శలు చేస్తారని పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు, మంత్రులు వెటకారపు మాటలు మాని పనికొచ్చే మాటలు మట్లాడాలని సలహా ఇచ్చారు.
తాను తెలుగు రాష్ట్రాల్లో ప్రజల అభివృద్ధిని, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ‘అనుష్టుప్ నారసింహ’ యాత్ర చేయాలని సంకల్పించినట్లు పవన్ ప్రకటించారు. తమ ఇలవేల్పు, కుల దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆ తర్వాత అదే జిల్లాలోని ధర్మపురి, నాంపల్లి క్షేత్రాల దర్శనతో నారసింహ యాత్ర మొదలవుతుందని, రెండు రాష్ట్రాలలోని 30 క్షేత్రాలను దశలవారీగా దర్శిస్తానని వివరించారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ సభకు కూడా సన్నాహాలు చేస్తున్నామన్నారు. వివిధ అంశాలపై పవన్ స్పందించారు.