Tirumala: శ్రీవారి సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 16 నుండి సర్వదర్శనం టోకెన్లను ఆఫ్ లైన్ ద్వారా తిరుపతిలో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. రోజుకు పది వేలు టోకెన్ల చొప్పున ఆఫ్ లైన్ ద్వారా కేటాయించానున్నట్లు టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. ఆర్జిత సేవలు పునరుద్ధరణకు సంబంధించి టీటీడీ బోర్డు లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కరోనా కారణంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాలను, సేవలను క్రమబద్ధీకరించారు. వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత పరిమితంగా దర్శనాలను అనుమతించారు. 300 రూపాయల టిక్కెట్లను మాత్రమే అనుమతిస్తూ వచ్చారు. భక్తుల నుంచి వచ్చిన ఒత్తిడి, విజ్ఞప్తి మేరకు గత సెప్టెంబర్ లో సర్వదర్శనం టిక్కెట్లు అనుమతించారు. మొదట్లో ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులకే దీన్ని పరిమితం చేశారు. ఇతర ప్రాంతాల భక్తులు కూడా పెద్ద ఎత్తున తిరుపతి చేరుకొని ఆందోళన చేయడంతో సెప్టెంబర్ 20 నుంచి అన్ని ప్రాంతాల భక్తులకూ దీన్ని విస్తరించారు. అయితే ఈ టోకెన్లన్నీ ఆన్ లైన్ ద్వారా జారీ చేసేవారు. కోవిడ్ మూడో దశ కూడా తగ్గు ముఖం పట్టడం, సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈనెల 16 నుంచి ఆఫ్ లైన్ లో కూడా టోకెన్లు అందించనున్నారు.