Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపబ్లిసిటీయే అతిపెద్ద సమస్య!

పబ్లిసిటీయే అతిపెద్ద సమస్య!

Oscar why lagging behind…
ఎందుకిలా?
మన సినిమాలు ఇంతేనా?
మనకంత ‘సీన్’ లేదా?
మరక్కర్ పోతే పోనీ,
జైభీమ్ కు ఏమైంది?
గొప్ప కథ
గొప్ప కథనం
దేశం మెచ్చిన సినిమా
మరి ఆస్కార్ కి ఏం తక్కువైంది?
కనీసం నామినేషన్ వరకైనా ఎందుకు వెళ్ళలేదు.
ప్రతి ఆస్కార్ సీజన్ లోనూ ఇవే ప్రశ్నలు
నూటపదేళ్ళ ఇండియన్ సినిమా..
93ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో
ఇప్పటి దాకా మూడంటే మూడు..
భారతీయ సినిమాలు నామినేషన్ల గట్టు దాటాయి.
అవార్డులకు చాలా దూరంలోనే ఆగిపోయాయి.
చివరిసారిగా లగాన్ నామినేట్ అయింది.
అంటే నామినేట్ అయి ఇరవైయేళ్లు దాటిపోయింది.

వచ్చే నెలలోనే 94వ ఆస్కార్ అవార్డులు సంబరం..
మనకి మాత్రం ఎలాంటి ఆశలూ లేవు.
(డాక్యుమెంటరీలో రైటింగ్ విత్ ఫైర్ ఒక చిన్న ఆశ)
ఎందుకిలా?

ఇది అర్థం కావాలంటే ఆస్కార్ డైనమిక్స్ తెలియాలి.
రెండు విషయాల్లో క్లారిటీ వుండాలి.
ఒకటి సినిమా క్వాలిటీ
రెండు సినిమా క్యాంపెయిన్

మొదట సినిమా క్వాలిటీ గురించి:
పవర్ ఆఫ్ ది డాగ్
ఈ ఏడాది అతి ఎక్కువ నామినేషన్లు వచ్చిన సినిమా ఇది.
కథ చాలా చిన్నది.
తల్లిని వేధించేవాడిని కొడుకు చంపేయడం.
ఇంతే స్టోరీ ..
మరి ఈ కథెక్కడ?
ఒక జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన జైభీమ్ కథ ఎక్కడ?
అక్కడే వుంది తేడా.
మనకి గొప్ప కథ వుంటే చాలు.
అది గొప్ప సినిమానే.
మిగిలిన ఆర్ట్‌ అండ్ క్రాఫ్ట్స్ జోలికి ఇండియన్ ఆడియన్స్ పెద్దగా వెళ్లరు

కానీ, ఆస్కార్ అలా కాదు.
కథ ఎలాగూ బావుండాలి.
దానికంటే, ఆ కథని ఎలా చెప్పామన్నది మరీ ముఖ్యం.
ఒక్కో దృశ్యం ఒక కథ చెప్పాలి.
ఒక్కో ఫ్రేమ్ ఒక్కో భావోద్వేగాన్ని పండించాలి.
వెలుగు, నీడ, శబ్దం, నిశ్శబ్దం .. దేనికైనా ఒక ప్రయోజనం వుండాలి
తెరమీద కనిపించే చెట్టు,చేమ రాయీ,రప్పా కూడా పాత్రలుగా మారిపోవాలి.
పాత్రలు మరీ మంచీ నలుపు, తెలుపుల్లా వుండకూడదు..
సంక్లిష్టత , సంఘర్షణ వుండాలి.
మొత్తంగా పాత్రచిత్రణలో ఒక గ్రాఫ్ వుండాలి. ఆర్క్ వుండాలి
జైభీమ్ కథ పరంగా నిస్సందేహంగా గొప్పసినిమా నే కానీ,
దృశ్యపరంగా అద్భుతమనిపించదు.
పాత్రలన్నీ మూసపోసినట్టే వుంటాయి.
కథనంలో సటిలిటీస్ ఏం ఉండవు.
మంచి చెడు రెండు శిబిరాల్లా వుంటాయి.

Oscar
కానీ, పవర్ ఆఫ్ ది డాగ్ అలా కాదు.
కథ సాధారణమైనదేకావచ్చు.
కానీ, ఆ సాధారణతలోనే ఒక అందముంటుంది.
కథ కోసం కాక, అనుభూతి కోసం చూడాల్సిన సినిమా
చూస్తున్న కొద్ది కొత్త కొత్తగా అర్థమయ్యే సినిమా.
తెరలేవో తొలిగిపోతున్నట్టు అనిపించే సినిమా.
పాత్రలు కాని పాత్రలుంటాయీ సినిమాలో.
ఉదాహరణకి ఒంటరి తనానిది ఈ సినిమాలో ప్రధానపాత్ర.
భర్త చనిపోయిన రోజీది ఒంటరి తనం.
తల్లికి మళ్ళీ పెళ్ళయిపోయాక ఆమె కొడుకు ఒంటరి
ఒంటరితనాన్ని భరించలేకే రోజీని పెళ్ళి చేసుకుంటాడు..జార్జ్
జార్జి పెళ్ళి తర్వాత ఫిల్ ఒంటరి వాడయిపోతాడు.
ఇలా పాత్రలు కానిపాత్రలు ఇంకా చాలా కనపిస్తాయి.
గ్లోవ్స్, పియానో, కొండలు, వాటి నీడలు,..
ఇవన్నీ నిర్జీవంగానే సినిమాలో కథకి జీవం పోస్తాయి..
జైభీమ్ ఇలాంటి కళాత్మక మెలకువలని పట్టించుకోదు.

ఒక్క జైభీమేకాదు.. చాలా వరకు మన సినిమాల్లో వీటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వం.
అలా అని అసలు ఈకళ తెలిసిన సినిమాలే లేవా?
వుంటాయి.
మలయాళం, బెంగాలి, మరాఠి, అస్సామీ,.
ఇలా అనేక భాషల్లో అద్భుతమైన సినిమాలే వస్తున్నాయి.
కానీ అవి కూడా ఆస్కార్ మెట్లెక్కలేవ.
ఎందుకు?

ఇక్కడే రెండో అంశం తెలుసుకోవాలి.
అదే క్యాంపెయిన్
ఆస్కార్ కేంపెయిన్ అనేది ఆషా మాషీ వ్యవహారం కాదు.
అసలు ఆస్కార్ అవార్డుల ఎంపికే చాలా సంక్లిష్టమైనది.
ఆస్కార్ కమిటీలో 6000కి పైగా సభ్యులుంటారు.
కనీసం పదో వంది మంది వోటేస్తే కానీ మన సినిమా నామినేట్ అవ్వదు.
అంటే నామినేషన్ కోసమే 600మంది ఆస్కార్ సభ్యులను మెప్పించాలి.
( ఆ తర్వాత గెలవాలంటే మరో మూడొందల మంది వేయాలి.)
ఆరొందల వోట్లు రావాలంటే, ఏ రెండుమూడు వేలమందికో మన సినిమాని చూపించాలి.
వీళ్లంతా ఒకే చోట ఏదో ఆఫీసులో వున్నట్టు వుండరు.
అమెరికాలో ఎక్కడైనా వుండొచ్చు.
ఏ పని లో అయినా వుండొచ్చు.
వాళ్ళందరూ మనసినిమా ఎందుకు చూస్తారు?
అప్పటికే ఈ సినిమా గురించి అంతర్జాతీయంగా చర్చ జరుగుతూ వుండాలి..
ఇదొక అద్భుతమైన సినిమా అనే ప్రచారం జరగాలి.

ఈ ప్రచారం ఎక్కడ జరుగుతుంది?
సన్ డాన్స్, కేన్స్, వెనిస్, టొరాంటో లాంటి పిల్స్ ఫెస్టివల్స్ లో జరుగుతుంది.
ఆయా ఫెస్టివల్స్ లో మనసినిమాని స్క్రీన్ చేయాలి.
అక్కడ సినిమా మేథావులను మెప్పించాలి.
ఈ ఫెస్టివల్స్ లో పాల్గొనడం,
స్క్రీన్ చేయడం..ఒకటో రెండో అవార్డులు సంపాదించడం..
వీటంతటికీ ఒక సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు అవుతుంది.
ఇన్ని చేస్తే ఆస్కార్ కమిటీ సభ్యులు మన సినిమా చూడడానికి ఇష్టపడొచ్చు.
ఇక్కడి నుంచి మళ్లీ స్క్రీనింగుల కథ మొదలవుతుంది.
వీళ్ళందరూ ఒకేసారి వచ్చిచూడరు.
కాబట్టీ కనీసం నాలుగైదు స్క్రీనింగ్స్ అయినా వేయాలి.
అవి కూడా అమెరికాలో టాప్ క్లాస్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో స్క్రీన్స్ అయితేనే వీళ్లు వస్తారు.
ఒక్కో స్క్రీనింగ్ కి కనీసం 20 లక్షలు ఖర్చవుతుందని ఒక లెక్క.
ఇంతా చేస్తే వాళ్ళకి మనసినిమా నచ్చుతుందన్న గ్యారంటీ ఏం లేదు.
పైగా ఇండియన్ సినిమాకి విదేశీ చిత్రాల కెటగరీకి మాత్రమే అర్హత వుంటుంది.
ఆ ఒక్క కేటగరీకి కనీసం వంద దేశాలు పోటీ పడుతుంటాయి.
సో.. ఇదీ తతంగం.
ఈ కాంపెయిన్ తో పాటు, సవాలక్షా ఆస్కార్ రూల్స్ వుంటాయి.
ఈ పోటీని , ఖర్చుని తట్టుకుని..
ఆస్కార్ వాళ్ళు పెట్టే హింసని భరించి,
తెల్లతోలు పొగరుని, ఇంగ్లీష్ ఆధిపత్యాన్ని సహించి..
మన సినిమాలని వాళ్ళచేత శెహభాష్ అనిపించుకోవడం అవసరమా అనేది ఇంకో చర్చ.


కాబట్టీ మనం ఆస్కార్ గురించి అతిగా ఆశలు పెట్టుకోకుండా..
మన పాన్ ఇండియా క్రేజ్ ని మనం కంటిన్యూ చేద్దాం.
(స్లమ్ డాగ్ మిలియనీర్ కి మూడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి కానీ, అది ఇండియాలో తీసిన బ్రిటిష్ సినిమా)

-శివప్రసాద్

Also Read :

గుండె బరువెక్కించిన జై భీమ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్