Saturday, July 27, 2024
Homeసినిమాగుండె బరువెక్కించిన జై భీమ్

గుండె బరువెక్కించిన జై భీమ్

Suryas Jai Bhim Highlighted The Issues Of Tribes And The Attitude Of Police Personnel :

కొన్ని సినిమాలు బాగుంటాయి.
మరికొన్ని బాధ కలిగిస్తాయి.
కొన్ని ఆలోచన రేకెత్తిస్తాయి.

కొన్నిటితో మనమూ ప్రయాణిస్తాం. లీనమై పోతాం. ఆ బాధలు, ఆనందాలు మనవిగా భావిస్తాం. వారికేమైనా సాయం చేయగలమా అనికూడా అనుకుంటాం. చాలు, ఆ మాత్రం కదిలిస్తే ఏ సినిమాకైనా అంతకన్నా పరమార్థం ఏముంది? ‘జై భీమ్‘ కూడా ఆ కోవకి చెందిన సినిమాయే. పోలీసు వ్యవస్థ అరాచకాలపై, అతి సామాన్యుల కష్టాలపై గతంలోనూ మంచి సినిమాలు వచ్చాయి. కానీ తెలుగులో అటువంటి సినిమా ఒక్కటన్నా వచ్చిందా? సినిమా మాధ్యమం కొందరి చేతుల్లో బందీ అవడమే ఇందుకు కారణమా? రాజకీయ వ్యవస్థ సైతం కుల రాజకీయాలతో ముడిపడ్డ రాష్ట్రాల్లో ఇంతేనా? కేరళ, తమిళనాడు రాష్ట్రాల చైతన్యం మనకెందుకు లేదు? జై భీమ్ చూశాక కలిగే సందేహాలివి.

“పూలు, బొకేలు పట్రాకండి – నేనేమీ దేవుడ్ని కాను
ఆకలితో లేను – కాబట్టి పళ్ళూ మిఠాయిలు తేకండి
చలితో గడగడలాడిపోవడం లేదు – శాలువల అవసరం ఏమీ లేదు
అలా అని మీనుంచి నేనేమీ ఆశించడంలేదనుకోకండి.
లోపలకు వచ్చేటప్పుడు శుభాశీస్సులు పట్టుకురావడం మాత్రం మరచిపోకండి”

ఈ వాక్యాలు లాయర్ చంద్రు ఆఫీస్ గోడలపై రాసి ఉంటాయి. ఈ పాత్ర, ఈ సినిమా ఇతివృత్తం నిజ జీవిత దర్పణమని తెలిసినపుడు ఆ వ్యక్తిత్వానికి సలాం చేయకుండా ఉండలేం. కాగడా పెట్టి వెతికినా అటువంటి వ్యక్తులు అరుదే. ఈ లాయర్ అనంతర కాలంలో న్యాయమూర్తిగా రికార్డు స్పీడ్ లో కేసులు పరిష్కరించారు. ఎర్రబుగ్గ కార్లతో మందీ మార్బలంతో గుళ్ళు, గోపురాల్లో హడావుడి చేసే వారిముందు ఈ చంద్రుగారు దేవుడు కాదూ? ఆయన నిరాడంబరత, మానవత్వపు కవచకుండలాలు దానమిద్దామన్నా అందుకునే కర్ణులేరీ?

చివరగా ఒక్కమాట- సాధారణ తెర నుంచి మల్టీప్లెక్స్, ఓటీటీ లకు విస్తరించిన తెలుగు సినీ మాఫియా నుంచి ఇటువంటి వాస్తవిక సినిమాలు ఆశించడం అత్యాశేనేమో! అందుకే

సూర్యా! నచ్చావయ్యా !

(సినిమా సమీక్ష)

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్