Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎదురులేని పరాక్రమం తిరుగులేని అనుగ్రహం 

ఎదురులేని పరాక్రమం తిరుగులేని అనుగ్రహం 

(ఈరోజు హనుమజ్జయంతి ప్రత్యేక వ్యాసం)

ఆంజనేయుడు మహా పరాక్రమవంతుడు..ఎంతటి పరాక్రమవంతుడో అంతటి వినయ సంపన్నుడు..
అంతకుమించిన సహనశీలి. ఆయనలో ఓ భక్తుడు..ఓ భగవంతుడు కనిపిస్తారు. అనునిత్యం.. అనుక్షణం ఆయన రామనామాన్ని జపిస్తూ రామభక్తులలో అగ్రగణ్యుడిగా కనిపిస్తాడు.

ఇక తాను అంకితభావంతో ఆరాధించే రాముడిని ఎవరు కొలిచినా.. తనని ఎవరు తలచినా ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా అనుగ్రహిస్తూ ఉంటాడు. మహాబలవంతుడిగా.. ‘గద’ను ఆయుధంగా ధరించిన వానర వీరుడిగా ఉన్న ఆయనను పిల్లలు కూడా ఎంతగానో ఇష్టపడుతుంటారు.. ఇలవేల్పుగా పూజిస్తూ ఉంటారు.
ఆంజనేయుడి జన్మ వృత్తాంతంలోకి వెళితే.. ‘పుంజికస్థల’ అనే ఓ అప్సరస ఒకసారి భూలోక విహారానికి వస్తుంది. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షిని చూసి, ఆకతాయితనంతో ఆయన తపస్సుకు భంగం కలిగిస్తుంది. ఉగ్రుడైన ఆ మహర్షి .. కోతివలె ప్రవర్తించి తన తపస్సుకు భంగం కలిగించిన కారణంగా వానరంగా మారిపొమ్మని శపిస్తాడు. ‘అంజన’ అనే పేరుతో వానరకాంతగా మారిపోయిన పుంజికస్థలకు, ‘కేసరి’ అనే వానరవీరుడితో పరిచయం అవుతుంది.

మహర్షుల ఆశ్రమ జీవితానికి ఆటంకాలు సృష్టిస్తున్న రెండు భీకరమైన ఏనుగులను ఆయన సంహరిస్తాడు. ఏనుగులను సింహం మాత్రమే చంపగలదు కనుక, మహర్షులు ఆయనను ‘కేసరి’ అనే పిలిచేవారు.

కేసరి.. అంజనాదేవి ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లిచేసుకుంటారు. తమకు బలవంతుడు.. బుద్ధిమంతుడు అయిన కుమారుడిని ఇవ్వమని అంజనాదేవి పరమశివుడిని ప్రార్ధిస్తుంది. దాంతో ఆ దేవదేవుడు త్రిపురాసుర సంహారంలో తనకి సహకరించిన విష్ణుమూర్తికి, రావణ సంహారంలో తాను సహకరించాలని నిర్ణయించుకుంటాడు. అందుకుగాను తన అంశను ఆమె గర్భమునందు ప్రవేశపెట్టే బాధ్యతను వాయుదేవుడికి అప్పగిస్తాడు. దైవకార్యాన్ని నిర్వహించిన వాయుదేవుడు, ఆ విషయాన్ని అంజనాదేవికి వివరించి అదృశ్యమవుతాడు. అందువలన హనుమంతుడిని వాయుపుత్రుడు .. అంజనీ తనయుడు .. కేసరి నందనుడు అని కొలుస్తుంటారు.

అంజనీదేవి ఓ శుభముహూర్తాన మగబిడ్డకు జన్మనిస్తుంది. మహాబలవంతుడైన ఆ పిల్లవాడిని చూసి కేసరి – అంజనాదేవి మురిసిపోతారు. ఒక రోజున బాగా ఆకలివేయడంతో చెట్లపైకి పండ్ల కోసం చూస్తాడు ఆంజనేయుడు. ఆ చెట్ల మధ్యలో నుంచి ఎర్రని పండులా మెరిసిపోతూ సూర్యుడు కనిపిస్తాడు. అంతే ఆ పండు తింటేనే ఆకలి తీరుతుంది అనుకుని ఆకాశంలోకి ఎగురుతాడు. సూర్యమండలం దిశగా ఒక శక్తి దూసుకు వస్తోందని రాహువు ద్వారా తెలుసుకున్న దేవేంద్రుడు, అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ‘వజ్రాయుధం’ విసురుతాడు. ఆ ధాటికి తట్టుకోలేక ఆంజనేయుడు అక్కడి నుంచి క్రిందపడిపోతాడు.


ఆంజనేయుడు అలా పడటం వలన ఆయన దవడలు (హనువులు) దెబ్బతింటాయి. ఆ కారణంగా ఆయన స్పృహ కోల్పోతాడు. బాలుడైన ఆంజనేయుడి పట్ల ఇంతటి కఠినంగా ప్రవర్తించిన కారణంగా వాయుదేవుడు గాలిని స్తంభింప జేస్తాడు. దాంతో ఇంద్రాది దేవతలతో కలిసి బ్రహ్మదేవుడు అక్కడికి వస్తాడు. ఆంజనేయుడిని ఎత్తుకుని ఆయన స్పృహలోకి వచ్చేలా చేయడంతో వాయుదేవుడు శాంతిస్తాడు. బ్రహ్మదేవుడుతో సహా ఇంద్రాదిదేవతలంతా కూడా ఆంజనేయుడికి తమ శక్తులలో కొంతభాగాన్ని ధారపోస్తారు. హనువులు దెబ్బతిన్న కారణంగానే ఆంజనేయుడిని హనుమంతుడు అని పిలవడం మొదలైంది.

సూర్యభగవానుడి దగ్గరే హనుమంతుడు విద్యను అభ్యసిస్తాడు. ఆ స్వామి అనుగ్రహంతో ఆయనలోని కొంత తేజస్సును.. అనంతమైన జ్ఞానాన్ని పొందుతాడు. అలాగే అష్టసిద్ధులను వశం చేసుకుంటాడు. ఇక శివాంశ సంభూతుడైన ఆయన శ్రీరాముడు పరిచయం అయిన దగ్గర నుంచి వదిలిపెట్టడు.

సీతమ్మవారి జాడ తెలుసుకోవడం.. రావణుడిని హెచ్చరించడం.. రాక్షస జాతిని భయకంపితులను చేయడం.. లంకానగర రహస్యాలను తెసులుకుని రావడం హనుమంతుడి పరాక్రమానికి.. బుద్ధి కుశలతకు.. ముఖ్యంగా ఆయన స్వామి భక్తికి అద్దం పడతాయి.

భూలోకాన పూజలు అందుకుంటాడనీ.. ఆయనను పూజించినవారికి సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుందని  ఇంద్రాదిదేవతలు దీవిస్తారు. అందువలన హనుమంతుడు ఈనాటికీ పూజాభిషేకాలు అందుకుంటూనే ఉన్నాడు. బుద్ధి కుశలతలోను.. కార్యదీక్షలోను తనకి సాటిలేరని రాముడిచే ప్రశంసలను అందుకున్న హనుమ, సీతమ్మ తల్లి వలన చిరంజీవిగా వరాన్ని పొందుతాడు. రామాలయాలలోను.. క్షేత్రపాలకుడిగాను .. ప్రధాన దైవంగాను హనుమంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.

అభయాంజనేయుడు..
దాసాంజనేయుడు..
వీరాంజనేయుడు..
ధ్యానాంజనాయుడు..
యోగాంజనేయుడు.. ఇలా అనేక నామాలతో.. ముద్రలతో స్వామి అనుగ్రహిస్తుంటాడు.
హనుమ జయంతి రోజున ఆ స్వామి కొలువైన అన్ని ఆలయాలలోను ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులు ‘హనుమాన్ చాలీసా’.. ‘సుందరకాండ’ పారాయణ చేస్తుంటారు. హనుమంతుడికి ఆకుపూజ .. సిందూర అభిషేకం .. నిర్వహించడం వలన, ఆయనకి ఇష్టమైన నేతి అప్పాలను నైవేద్యంగా సమర్పించడం వలన ప్రీతి చెందుతాడని అంటారు. సమస్త దోషాలను.. పీడలను తొలగించి ఆయురారోగ్యాలను అందిస్తాడనీ.. సకల శుభాలు చేకూర్చుతాడని విశ్వసిస్తూ ఉంటారు. హనుమా .. దయగనుమా అంటూ ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులవుతుంటారు.

– పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్