Saturday, November 23, 2024
HomeTrending Newsఅబివృద్దిలో తెలంగాణ నంబర్ వన్ - మంత్రి వేముల

అబివృద్దిలో తెలంగాణ నంబర్ వన్ – మంత్రి వేముల

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీ ఆర్ ఎస్ పార్టీకి బిజెపి, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలవాలని రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం వేల్పూరులో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అదేవిధంగా పెద్దవాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం, సి సి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి యావత్తు దేశం అబ్బుర పడుతోందని అన్నారు. మహారాష్ట్రలో ని 14 గ్రామాలకు చెందిన సర్పంచులు తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు వినతి పత్రం అందించారని గుర్తు చేశారు. చివరకు బీజేపి అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అదే పార్టీకి చెందిన రాయచూరు ఎమ్మెల్యే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ కూడా అమలు చేయాలని, లేకపోతే తన నియోజకవర్గంను తెలంగాణలో కలపాలని కర్ణాటక ప్రభుత్వంను డిమాండ్ చేశారంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరును అర్ధం చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.

కేవలం మూడేళ్ళ వ్యవధిలోనే ప్రపంచంలో నే అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరంను నిర్మించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాళేశ్వరం జలకళను చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయన్నారు. ఇదే కాకుండా కోటి కుటుంబాలకు ఇంటింటికీ కుళాయిలు అమర్చి మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తున్నామని అన్నారు. అతి తక్కువ జనాభా కలిగి ఉండే అభివృద్ధి చెందిన దేశాలకు సైతం సాధ్యం కాని దానిని కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఆచరణలో సాధ్యం చేసి చూపిందన్నారు. అందుకే తెలంగాణ లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పరిశీలన కోసం ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధుల బృందాలు తెలంగాణలో పర్యటిస్తూ, ఇక్కడి ప్రగతిని చూసి ఆశ్చర్య చకితులవుతున్నారని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ లో ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, సేద్యానికి ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి అనేకానేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోందని అన్నారు. ఏ రంగంలో చూసినా తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం గా నిలుస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. అందుకే తెలంగాణ లో జరిగిన అభివృద్ధి దేశమంతటా జరగాలనే ఆకాంక్షతో కేసీఆర్ ను దేశ ప్రధానిగా చూడాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ఈ వాస్తవాలను బీజేపి, కాంగ్రెస్ నాయకులు గుర్తించి తెరాసకు బాసటగా నిలిచి తెలంగాణ ను ప్రగతి లో మరింతగా పరుగులు పెట్టించేందుకు దోహదపడాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read : దళితుల ఆర్ధికవృద్దికే దళితబంధు

RELATED ARTICLES

Most Popular

న్యూస్