Grandpa of Tamil: తమిళ భాషకు విశేష సేవలు అందించి “తమిళ తాత”గా ప్రసిద్ధి చెందిన పండితుడు ఉ. వె. స్వామినాథ అయ్యర్ గురించి కొన్ని సంగతులు….తమిళనాడులోని కుంభకోణం సమీపాన గల ఉత్తమదానపురంలో 1855 ఫిబ్రవరి 19వ తేదీన. వెంకట సుబ్బయ్యర్, సరస్వతి అమ్మాళ్ దంపతులకు స్వామినాథ అయ్యర్ జన్మించారు.
ఆయన తండ్రి ఓ సంగీత విద్వాంసులు. హరికథలు చెప్పేవారు. ఉత్తమదానపురంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన అయ్యర్ సంగీతమూ నేర్చుకున్నారు. తమిళ భాషమీద మక్కువెక్కువ. ఎక్కడెల్లా తమిళ పాఠాలు నేర్పిస్తారో అక్కడికల్లా వెళ్ళి ఆయన తండ్రి కుటుంబంతో వెళ్ళి ఆచోట తమ కొడుకుకి తమిళం నేర్పుకునేలా చేశారు.
తిరుచిరాపల్లికి చెందిన ప్రఖ్యాత మహా విద్వాన్ మీనాక్షి సుందరం పిళ్ళయ్ దగ్గర స్వామినాథ అయ్యర్ అయిదేళ్ళపాటు ప్రత్యేకించి తమిళ పాఠాలు చదువుకుని తమిళ మేధావిగా అన్పించుకున్నారు.
1880 నుంచి1903 వరకు కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో ఆచార్యులుగా పని చేశారు. అనంతరం 1903 నుంచి పదహారేళ్ళపాటు చెన్నై రాష్ట్ర కళాశాలలో పని చేశారు. ఇక్కడ పని చేస్తున్న రోజుల్లోనే ఈయన తిరువల్లిక్కేణిలోని తిరువేట్టీశ్వరన్ పేటలో స్థిరపడ్డారు. ఈయన తమిళ భాషకు చేస్తున్న సేవకు గాను 1906లో చెన్నై ప్రభుత్వం మహామహోపాధ్యాయ బిరుదుతో సత్కరించింది.
1932లో చెన్నై విశ్వవిద్యాలయం ఈయనను తమిళ ఇలక్కియ అరింజ్ఞర్ ఆనే బిరుదుతో ఘనంగా సన్మానించింది. 1937లో చెన్నైలో మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన సాహిత్య మహానాడులో ఆహ్వాన సంఘానికి ఈయన అధ్యక్షుడిగా వ్యవహరించి ప్రసంగించారు. ఈయన ప్రసంగాన్ని విన్న గాంధీజీ ఈ పెద్దాయన పర్యవేక్షణలో తమిళం నేర్చుకోవాలనుందని వేదికపై వెల్లడించారు. ఈ సందర్భంలోనే ఆయనను అందరూ తమిళ తాతా అని పిలువడం మొదలుపెట్టారు.
ప్రాచీన తమిళ తాళపత్రాలకు కొత్తరూపం ఇవ్వాలనుకుని ఆ దిశలో పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో పలు ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో ముందుకు సాగి 1887లో చింతామణి అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు.
ఆరోజు మొదలుకుని తుదిశ్వాస వరకు అక్కడక్కడా తెరమరుగైన తమిళ భాషకు సంబంధించిన విషయాలను వెతికి వాటిని పరిశోధించి కొత్తరూపునిచ్చి సాహిత్యానికి అందించారు. తమ కాలానికి ముందున్న మహాపండితుల గ్రంథాలను, సంగ కాల గ్రంథాలను అధ్యయనం చేశారు. అగనానూరు, పురనానూరు, మణిమేఖలై, వంటి అపూర్వ గ్రంథాలను అందుబాటులోకి తెచ్చారు. పురాతన తమిళ సాహిత్య కావ్యాలను వెతికి వెతికి ముద్రించి పాఠకులకు అందించారు.
ఈయన చేపట్టిన కృషివల్లే తమిళ భాషలో అరుదైన అనేక పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. వందకుపైగా పుస్తకాలను ముద్రించారు. మూడు వేలకుపైగా తాళపత్ర ప్రతులను, రాతప్రతులను సేకరించి అధ్యయనం చేశారు. పుస్తకాల ముద్రణ కోసం తన ఆస్తిని అమ్ముకున్నారు. పురాణాలకు సంబంధించి అనేక తాళపత్ర ప్రతులను గాలించి పరిష్కరించి పాఠకలోకానికి అందించారు. ఈ విధంగా అనేక తరాలవారికి ఉపయోగపడేలా పురాతన తమిళ కావ్యాలను వెలుగులోకి తీసుకొచ్చి తమిళ భాష గొప్పతనం పది మందికీ తెలిసేలా చేశారు.
పురాతన తమిళ కావ్యాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు. ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనేటట్లుండేది. చమత్కారంగా మాట్లాడేవారు. స్వామినాథ అయ్యర్ ప్రతిభను పాండిత్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన స్మృత్యర్థం ఓ పోస్టల్ స్టాంపుని విడుదల చేసింది.
చెన్నై బెసంట్ నగర్లో ఆయన పేరిట ఓ గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఆయన 1940 ఎన్ చరిత్తిరం (నా చరిత్ర) అనే పుస్తకాన్ని రాయడం మొదలుపెట్టారు. ఈ పుస్తకంలో తమిళ భాషాభివృద్ధి, తమిళనాడు చరిత్ర, ఆయన కాలంలో జీవించిన తమిళ పండితుల గురించీ రాశారు. ఈ పుస్తకం పూర్తికాకుండానే 1942 ఏప్రిల్ 28 వ తేదీన తుదిశ్వాసవిడిచారు.
– యామిజాల జగదీశ్
Also Read :