Not Statuary : ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనకు, కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ స్పష్టం చేశారు. జనాభా లెక్కలు పూర్తయ్యే వరకూ మండలాలు గానీ, జిలాలు గానీ విభజన చేపట్టకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని, దీనితో ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న విభజనకు ఎలాంటి శాస్త్రీయతా ఉండబోదన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు ఉద్దేశపూర్వకంగానే అడ్డంకులు సృష్టించారని, ఇది సిఎం జగన్ విపరీత మనస్తత్వ ధోరణికి నిదర్శనమని లోకేష్ విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా షరతులు పెట్టి సినిమా రంగాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
ఈ ప్రభుత్వ అసమర్ధత, చేతగానితనం వల్లే విశాఖ నగరం నుంచి హెచ్ ఎస్ బీ సి తరలిపోయిందని లోకేష్ మండిపడ్డారు. తాను రెండున్నరేళ్ళు రాష్ట్రానికి ఐటి మంత్రిగా ఉండగా ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి ఐటి రంగంలో తీసుకు వచ్చామని, ఏ ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోలేదని ఆయన గుర్తు చేశారు. అదానీ డేటా సెంటర్ వెళ్లిపోవడంపై కూడాఅధికార పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మూడేళ్ళలో రాష్ట్రానికి, వైజాగ్ కు ఒక్క కొత్త ఇండస్ట్రీ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. తిరుపతి ఎయిర్ పోర్ట్ దగ్గరలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తాను కష్టపడి తీసుకొస్తే ఆ పరిశ్రమలోని కాంట్రాక్టు పనులన్నే తనకే ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారని, ఎందుకు వచ్చామా అని వారు బాధపడుతున్నారని లోకేష్ వెల్లడించారు.
తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని సాక్షి పై రూ.75 కోట్లకు పరువునష్టం దావా వేసిన లోకేష్ కేసు విచారణ నిమిత్తం విశాఖ కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో ఈ నెల 24వ కూడా లోకేష్ కోర్టుకు హాజరయ్యారు. ప్రతివాదులు వాయిదా కోరడంతో కోర్టు నేటికి విచారణ వాయివా వేసింది. దీనితో మరోసారి లోకేష్ విశాఖ వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.
Also Read : ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాల్లో పాలన