#VK100 :వంద టెస్టులు అడతానని తాను ఎప్పుడూ అనుకోలేదని టీమిండియా క్రికెట్ స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఇంత సుదీర్ఘ కాలం పాటు తన కెరీర్ కొనసాగడానికి సహకరించిన బిసిసిఐ, ప్రేక్షకులు, కుటుంబ సభ్యులు, కోచ్ అందరికీ కోహ్లీ ధన్యవాదాలు తెలియజేశాడు. తాను ఎప్పుడూ ఎక్కువ పరుగులు సాధించే అంశంపైనే దృష్టి సారించానని, వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకే ప్రయత్నించానని చెప్పాడు. మొదట జాతీయ జట్టులో చోటు సంపాదించడానికి ముందే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఏడెనిమిది డబుల్ సెంచరీ లు సాధించానని గుర్తు చేసుకున్నాడు. తాను ఎప్పుడూ జట్టు ప్రయోజనాల పైనే ధ్యాస పెట్టానని వివరించాడు.
ఇండియా –శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యంలో మొహాలీ లోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో రేపు మొదలు కానుంది. మూడు టి 20 మ్యాచ్ ల సిరీస్ ను స్లీన్ స్వీప్ చేసిన ఇండియా టెస్టు సిరీస్ ను కూడా అదే తరహాలో విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతోంది. రేపటి టెస్ట్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైనది, అతడికి ఇది 100 వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. జట్టు సహచరులు, మాజీ ఆటగాళ్ళు, బిసిసిసి అధ్యక్ష, కార్యదర్శులు, విదేశీ ఆటగాళ్ళు కూడా కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఇండియా తరఫున ఇప్పటి వరకూ 11మంది ఆటగాళ్ళు 100టెస్టుల మైలురాయిని సాధించారు. సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు ఆడడం విశేషం. ఆ తరువాత రాహుల్ ద్రావిడ్ (163), వివిఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే(132), కపిల్ దేవ్(131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్ సర్కార్(116), సౌరవ్ గంగూలీ(113), ఇషాంత్ శర్మ(105), హర్భజన్ సింగ్(103), వీరేందర్ సెహ్వాగ్(103) లు ఈ ఘనత సాధించారు. ఇప్పుడు 12వ ఆటగాడిగా కోహ్లీ ఈ క్లబ్ లో చేరబోతున్నాడు. 2011 లో టెస్ట్ క్రికెట్ కెరీర్ మొదలు పెట్టిన కోహ్లీ ఇప్పటివరకూ 99 టెస్టులు ఆడి 7962 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 254 (నాటౌట్); మొత్తం 27 సెంచరీలు సాధించగా, బ్యాటింగ్ యావరేజ్ 50.39గా ఉంది, 100 క్యాచ్ లు పట్టాడు.
ఈ సందర్భంగా తన కెరీర్ సంగతులను బిసిసిఐ టివి తో కోహ్లీ పంచుకున్నాడు. ఈ వంద టెస్టుల మైలురాయిని అధిగమించే క్రమంలో ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడానని, దేవుడి దయ తో పాటు, కఠోర శ్రమ, శిక్షణ, ఫిట్ నెట్ గా ఉండడం లాంటి అంశాలు దీనికి దోహదం చేశాయని వెల్లడించాడు. వందో టెస్టు ఆడడం తనకు, కుటుంబ సభ్యులకు, కోచ్ కు ఎంతో ఉద్విగ్న క్షణాలని, మధురమైన అనుభూతి అని చెప్పాడు.