పాకిస్తాన్ పెషావర్ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 60కి చేరింది. పెషావర్‌లోని షియా మసీదులో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 200 మంది గాయపడినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడింది ఎవరు అనేది తెలియరాలేదు. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెషావర్ నగరంలో ఆత్మాహుతి దాడి జరగటం ప్రభుత్వాన్ని సవాల్ చేసినట్టైంది.
24 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ తీవ్రవాదులు బాంబు దాడితో కంగారెత్తించారు. శుక్రవారమే పెషావర్‌కు 187 కిమీ దూరంలో ఉన్న రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లలో కంగారు మొదలైంది.
ఉగ్రవాదుల దాడుల భయంతో పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ఏ జట్టు ఇష్టపడలేదు. దీనికి తోడూ 2009లో పాక్ పర్యటనకు వచ్చిన లంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఈ దాడిలో లంక క్రికెటర్లు సమరవీర, జయవర్దనే, సంగక్కర సహా తదితర క్రికెటర్లు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్తాన్ పోలీసులతో పాటు ఇద్దరు దేశ పౌరులు కాల్పులకు బలయ్యారు.