చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను, గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో కలిసి వారి అధికారిక నివాసంలో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కులను అందజేశారు.

 

ఆ తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో కలిసి శిబు సోరెన్ ను కలిశారు. సిఎం కెసిఆర్ వెంట ఎమ్మెల్సి కవిత, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపి వినోదకుమార్, ఎంపి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.  అనంతరం మీడియాతో మాట్లాడిన సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతీ దశలో వెన్నంటే శిబూ సొరేన్ ఉన్నారని, వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకున్నామని అన్నారు.

కెసిఆర్ మాటల్లోనే….

ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాకు శిబు సోరెన్ ని కలిపించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నేను వారి ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఫలవంతమైన చర్చలు జరిగాయి. రాజకీయపరమైన చర్చలు కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు సాగుతున్నాయి.


75 సంవత్సరాల స్వాత్రంత్యనాంతరం కూడా దేశం అభివృద్ధి చెందాల్సినంతగా జరగలేదు. ప్రపంచంతో పోల్చితే చాలా విషయాల్లో మనం వెనుకబడిపోయాం. పొరుగున ఉన్న చైనా అభివృద్ధి చెందింది. ఎన్నో ఆసియా దేశాలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వం, దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదు. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతీ భారతీయుడి పై ఉంది. దీనికి సంబంధించి కూడా చర్చ జరిగింది.

దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మేమంతా ఒకచోట కలుస్తాం. తర్వాత ఏ ఎజెండాతో ముందుకు పోవాలో, ఎలా ముందుకు పోవాలో, దేశాన్ని మరింత ఉత్సాహంగా, అభివృద్ధి దిశగా ఎలా నడిపించాలనే ప్రయత్నాలను ఏ విధంగా అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలనే విషయాలను చర్చిస్తాం. దీనికి సంబంధించిన విషయాలను తర్వాత మరింతగా మీకు వివరిస్తాం.

 

భారతదేశాన్ని సరైన దిశలో తీసుకుపోవాల్సిన ఒక గట్టి ప్రయత్నం జరగాలి. ఈ ప్రయత్నం ప్రారంభమైంది. చర్చలు జరుగుతున్నాయి. యాంటి బిజెపి ఫ్రంట్, యాంటి కాంగ్రెస్ ఫ్రంట్, ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ లాంటివి లేవు. నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్న. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్… ఏ ఫ్రంట్ ఇప్పటికీ ఖరారు కాలేదు. భవిష్యత్తులో దీని పై స్పష్టత వస్తుంది.

పురోగామి భారత్ ను నిర్మించడంలో మీ (జర్నలిస్టుల) పాత్రను కూడా మేము ఆశిస్తున్నాం. దీనికి ఇప్పుడే పేరు పెట్టకండి. నేను చెప్పదల్చుకున్న విషయాలను స్వచ్ఛమైన, మంచి మనసుతో, అర్థవంతంగా చెప్తున్నాను. ప్రస్తుతమున్న భారత్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన భారత్ ను నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు అందజేయలనేదే మా ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే మా ప్రయత్నాలు సాగుతున్నాయి.

దేశంలో ఎన్నో పార్టీలను, పలు సంఘాల నేతలను, రైతు నాయకులను కలవడం జరుగుతున్నది. ఏ విషయంలో ఎలా ముందుకు పోవాలనే విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించలేం. ఒకరిద్దరితో ఇది అయ్యే పని కాదు. అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఒక దారి దొరకుతుంది. ఏ దారిలో వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలా లేదా మరోటి ఏర్పాటు చేయాలా అనే విషయాలను మీకు మున్ముందు తెలియజేస్తాం.

Also Read :జార్ఖండ్ పర్యటనకు కెసిఆర్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *