Lady Villain: సక్సెస్ ను సాధించిన చాలా మంది జీవితాలను పరిశీలన చేస్తే, తాము దేనికి పనికి వస్తామనే విషయాన్ని సరైన సమయంలో గ్రహించి .. వెంటనే ఆ మార్గంలో అడుగు ముందుకు వేసిన తీరు కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఆ బాటలో ముందుకు నడిచిన విధానం కనిపిస్తుంది. తమ మనసుకు నచ్చిన పనిని అంకితభావంతో చేసిన తీరు కనిపిస్తుంది. అలాంటివారి జాబితాలో వరలక్ష్మి శరత్ కుమార్ పేరు కూడా కనిపిస్తుంది. తమిళంలో మాస్ హీరోగా ఒక రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న శరత్ కుమార్ కూతురే వరలక్ష్మి. అందమైన విలనిజానికి ఇప్పుడు ఆమె కేరాఫ్ అడ్రెస్.
నటవారసురాలిగా వరలక్ష్మీ చాలాకాలం క్రితమే కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ గా అక్కడి ప్రేక్షకులకు పరిచయమైంది. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే హీరోల కూతుళ్లు తెరపై డీసెంట్ గా కనిపించాలనే అభిమానులు కోరుకుంటారు. బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చిన హీరోయిన్లతో సినిమా చేయాలంటే దర్శక నిర్మాతలకు తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే తెరపై గ్లామరస్ గా కనిపించాలంటే ఆ హీరోయిన్లకు తాము వచ్చిన నేపథ్యం కూడా అడ్డుపడుతుంది. అందువలన అలాంటి పాత్రలను చేయడానికి వారు అంగీకరించరు.
చాలా తక్కువ సమయంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ ఈ విషయాన్ని గ్రహించింది. అలా అని చెప్పేసి తనకి ఎంతో ఇష్టమైన నటనను వదులుకోలేదు. అందుకే నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయాలని నిర్ణయించుకుంది. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఆ దిశగానే అడుగులు వేసింది. కోలీవుడ్ కి మాత్రమే కాదు .. తెలుగు తెరకి కూడా తన విలనిజం ఎలా ఉంటుందనేది చూపించింది. నిండుగా .. నిబ్బరంగా కనిపిస్తూ, విశాలమైన కళ్లతో అద్భుతంగా ఆమె పలికిస్తున్న విలనిజానికి ఇక్కడి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆమె ‘యశోద’ .. ‘హను మాన్’తో పాటు బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమాలోను నటిస్తోంది. ఇటీవల కాలంలో ఆమె తమిళంలో కంటే తెలుగులో బిజీ అవుతుండటం విశేషం.