Explain Policies: ఎవరిపైనైనా విమర్శలు చేసే ముందు పవన్ కల్యాణ్ తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. నిన్నటి సభలో విమర్శల బదులు ప్రజా సమస్యలపై మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. అసలు తాను రాజకీయ వ్యవస్థలో ఉన్నానా? లేదా? ఉంటే ప్రజలకు ఏం కావాలో…వాటిపై తన పార్టీ ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటుందనే దానిపై పవన్ కు స్పష్టత ఉండాలన్నారు. కేవలం కొంతమంది వ్యక్తుల మీద, మంత్రుల మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని దూషణలు ఆడితే ప్రజలు హర్షిస్తారా అని ప్రశ్నించారు. ఎంతసేపూ వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేస్తూ దిజగారుడు రాజకీయాలు పవన్ ప్రసంగంలో కనిపించాయని విమర్శించారు. సభకు వచ్చివారికి ఆనందం, ఆహ్లాదం కలిగించడం కోసం నాలుగు డైలాగులు చెబితే సరిపోదన్నారు. ‘అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటే కదా వాటిని చీలనివ్వకుండా చూడడానికి’ అని, పొత్తుల గురించి ఆలోచిస్తారో, మొక్కజొన్న పొత్తుల గురించి ఆలోచిస్తారో చూద్దామని బొత్స సెటైర్లు వేశారు.
వైసీపీ లక్ష్యంగానే అయన పవన్ విమర్శలు సాగాయని, సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు జగన్ ను తిడతారా అని బొత్స నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని బొత్స అన్నారు. పవన్ కు సొంతంగా ఓ కార్యాచరణ లేదని, అందుకే బిజెపి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారని బొత్స ఎద్దేవా చేశారు. రాజకీయంగా విధానపరమైన నిర్ణయాలు ప్రకటించలేని వ్యక్తి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము సొంతంగానే వెళతామని స్పష్టం చేశారు.
మూడేళ్లలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామగ్రామాన, వాడవాడలా ప్రజలకు వివరించాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని బొత్స వివరించారు.