Saturday, November 23, 2024
HomeTrending Newsమత్స్యకార సొసైటీల్లో నిబంధనల సడలింపు

మత్స్యకార సొసైటీల్లో నిబంధనల సడలింపు

Fishermen Community : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని, మత్స్య శాఖకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ది, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని అన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD)లో మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన JAC ప్రతినిధులతో జరిగిన 4 వ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో MLC బండ ప్రకాష్ ముదిరాజ్, MLA ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, గంగపుత్ర సంఘం అధ్యక్షులు దీటి మల్లయ్య, మత్స్య శాఖ అధికారులు శంకర్ రాథోడ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, ఇరిగేషన్ SE శ్రీనివాస్, కో ఆపరేటివ్ శాఖ అదనపు రిజిస్ట్రార్ సుమిత్ర, పలు జిల్లాలకు చెందిన గంగపుత్ర, ముదిరాజ్ వర్గాలకు చెందిన ప్రతినిధులు కాపర్తి మోహనకృష్ణ, మెట్టు ధనరాజ్, కైరంకొండ యాదగిరి, గాలి సత్యనారాయణ, గొడుగు శ్రీనివాస్, గుండ్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. సంపద సృష్టించాలి… దానిని పేదలకు పంచాలి అనే విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 వేల చెరువులు మాత్రమే చేపల పెంపకానికి అనువుగా ఉండేవని, నీటి పారుదల ప్రాజెక్ట్ ల నిర్మాణం చేపట్టి నీటి సరఫరాను మెరుగు పర్చడం వలన నేడు 23 వేల కు పెరిగాయన్నారు. రాష్ట్రంలో నీటి వనరులు పెరగడమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్న కారణంగా రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని తెలిపారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధి ఎంతో మెరుగుపడిందని తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మత్స్య కారుడు ప్రభుత్వ లబ్ది పొందేందుకు సొసైటీలో సభ్యత్వం కల్పించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందని, అవసరమైతే నిబంధనలను సడలించే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పారు.

100 ఎకరాల లోపు ఆయకట్టు కలిగిన చెరువుల లీజు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చి తగ్గించాలని కోరగా, ఈ విషయమై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి 10 రోజులలో నివేదికను సమర్పించాలని మత్స్య శాఖ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. మత్స్యకారులు ఐక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి చెందాలని మంత్రి కోరారు. మత్స్యకారుల మద్య ఉన్న సమస్యలను JAC కమిటీ ప్రతినిధులు ఆయా జిల్లాలలో పర్యటించి పరిష్కారానికి కృషి చేయాలని, మత్స్య శాఖ అధికారులు పూర్తిస్థాయి సహకారం అందిస్తారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సామరస్య చర్చలతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, మత్స్యకారులు ఐక్యంగా ఉండటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. మత్స్యకారులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా అన్ని జిల్లాలలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనేక చోట్ల చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, FTL నిర్దారించి ఆక్రమణలను నివారించాలని JAC ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులను, మత్స్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగినందున జిల్లాలో ఫిష్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని, ఇందులో మత్స్యకారులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్