Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏమిటా పిచ్చి మాటలు?

ఏమిటా పిచ్చి మాటలు?

Mental in different forms: ఏమిటా పిచ్చి మాటలు ? అని విసుక్కుంటాం కానీ నిజానికి ఎవరి పిచ్చి వారికి అక్షరాలా ఆనందం; కొందరికి ఆ పిచ్చే పరమానందం; కొద్దిమందికి ఆ పిచ్చే బ్రహ్మానందం. మానసికశాస్త్రవేత్తలు నయం చేయగలమనుకునేది ఒక స్థాయి పిచ్చి . వారు కూడా నయం చేయలేనిది తరువాత స్థాయి పిచ్చి.  నిజానికి ఎవరూ నయం చేయలేనిదే అసలయిన పిచ్చి. ఇది అమూర్తం. మాటలకు అందీ అందదు. చూపులకు కొద్దిగా అందుతుంది. చేష్ఠలకు దాదాపుగా దొరికిపోతుంది.

పంటికి పళ్ల డాక్టరు , కంటికి కళ్ల డాక్టరు ఉన్నట్లు పిచ్చికి పిచ్చి డాక్టరు ఉంటాడు . భాషాపరంగా పిచ్చి డాక్టరుకు రెండు అర్థాలు. పిచ్చిని నయం చేసే డాక్టరు అన్నది సాధించాల్సిన అర్థం. డాక్టరే పిచ్చివాడయినప్పుడు అర్థం సాధించాల్సిన పనిలేకుండా పిచ్చే డాక్టరును సాధిస్తుంది.

Mental Illness

పిచ్చిని కొలిచే పరీక్షలు పిచ్చి పరీక్షలు అంటే చిన్నయసూరికి కూడా పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు . అంతమాత్రం చేత మనం మామూలుగా చేయించుకునే పరీక్షలు పిచ్చివి కాకుండాపోవు . ఇవి మామూలు పిచ్చి పరీక్షలు ; అవి పిచ్చ పిచ్చి పరీక్షలు అనుకుంటే మన ఆరోగ్యానికి వచ్చిన నష్టమేమీలేదు . మనోరోగానికి మందులేదు – అన్నసామెతను రూపుమాపడానికి పిచ్చిని నయం చేసే డాక్టర్లు పిచ్చి పిచ్చిగా ప్రయత్నిస్తుంటారు . ఫలితం పిచ్చితగ్గి పిచ్చిరహిత లోకంలో జనజీవనస్రవంతిలో తిరుగుతున్నవారెవరయినా చెబితే తప్ప మనకు తెలియదు .

వేపకాయంత వెర్రి అందరికీ ఉంటుందనికూడా తెలుగులో పాపులర్ సామెత . హైదరాబాద్ ప్రపంచతెలుగు మహాసభల్లో ఈ సామెతమీద గుమ్మడికాయలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి . దాంతో నిర్వాహకులు పెద్ద మనసుతో మూజువాణి ఓటుతో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు . పూర్వం ఎప్పుడో పాత రాతియుగం నాడు వేపకాయంతే , ఇప్పుడది పెరిగి పెరిగి అందరిలో గుమ్మడికాయంత వెర్రిగా బుర్రలో గూడు కట్టుకుందట . గుమ్మడికాయల . . . అనగానే ఇప్పుడు భుజాలు తడుముకోనక్కర్లేదు ; తల తడుముకుంటే చాలు .

ప్రేమా పిచ్చి ఒకటే అన్నారు కానీ ఇందులో విభాగాలు చాలా ఉన్నాయి. ప్రేమ పిచ్చిగా మారడం – ప్రేమ పిచ్చి ; పిచ్చి ప్రేమగా రూపాంతరం చెందడం – పిచ్చి ప్రేమ. ఇవి స్థూలంగా ఒకేలా అనిపించినా వస్తుతః స్థూల జాతీయ సగటు రాబడికి , స్థూల వ్యయ సూచీకి ఉన్నంత తేడా ఉంటుంది. రివర్స్ రెపో రేటుతో ఫార్వర్డ్ ద్రవ్యవినిమయ శక్తిని కొలిస్తే ఆర్థిక పిచ్చి. ఏం జరుగుతోందో అందరికీ తెలిసే ఉంటుంది …కానీ…ఏమీ జరగనట్లు ఉద్దీపన జాకీలు పెట్టి ఎంత లేపినా…జాకీ రాడ్ లు చాలనప్పుడు అర్థం అయినా…కానట్లు ఉండే ఆత్మనిర్భర ప్రతీకాత్మక పిచ్చి .

పిచ్చి అంటే అంతా చెడే కానక్కర్లేదు . చదువు పిచ్చి , ఆటల పిచ్చి , ర్యాంకుల పిచ్చి , మార్కుల పిచ్చి ఇలా మంచిపిచ్చి కూడా ఉండవచ్చు . అసలు పిచ్చివారిని గొలుసులతో బంధిస్తారు. మంచిపిచ్చివారి గొలుసులు మనకు కనపడవు – అంతే తేడా .

పిచ్చికి రకరకాల వైద్యాలున్నాయి కానీ – అన్నిటిలోకి గొప్పవైద్యం , సమాజం అంగీకరించినది పెళ్లి.  పెళ్లి చేస్తే తిక్క కుదురుతుంది అన్న మాటను వ్యాకరణపండితుల ప్రమేయలేకుండా సమాజం తనకుతాను అన్వయార్థం చెప్పినట్లుంది. తిక్క ఎవరికి కుదురుతుంది ? కుదురుకోవడం అంటే బాగా సెటిల్ కావడం అనే అర్థాన్ని ఏ నిఘంటువు కాదనలేదు. కాబట్టి పెళ్లి చేస్తే తిక్క ఇంకా వ్యవస్థీకృతం కావడం , లేదా ఇద్దరిలో పాలునీళ్లలా తిక్క కలగలిసి ఆదర్శ తిక్క బాగా కుదురుకున్న దాంపత్యం కావచ్చు.

పిచ్చోడి చేతిలో రాయి మామూలువాడిచేతిలో రాయికంటే చాలా విలువయినది. కుక్కకు పిచ్చి ముద్ర వేయి , ఆపై చంపెయ్ – అని ఇంగ్లీషులో గొప్ప కుక్క పిచ్చి సామెత . ఈ సామెత అవసరం లేకుండానే సమాజంలో మాట్లాడే ప్రతివారిమీద ఈ ముద్రనే వేస్తారు . తరువాత ఎవరూ చంపక్కర్లేకుండా మాట్లాడే గొంతులు తమకు తామే ఆత్మహత్య చేసుకుంటాయి. ఆత్మహత్యలనుండి బయటపడితే కుక్క – పిచ్చి – చంపు సామెత ఉండనే ఉంది చంపడానికి .

పిచ్చిని చంపేయాలనుకుంటే భూమండలంలో మిగిలేదెవరు ?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఆత్మహత్యలు పరిష్కారం కాదు

RELATED ARTICLES

Most Popular

న్యూస్