స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్, శివ్‌రామ్ రాజ్‌గురులు అమరులైన రోజు మార్చి 23. అమరుల దినోత్సవంగా జరుపుకునే ఈ రోజున రాష్ట్రంలో సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి భగవంత్ మన్. ఈ విషయంపై అసెంబ్లీలో భగవంత్ మంగళవారం ప్రకటన చేశారు. అలాగే అసెంబ్లీలో భగత్ సింగ్‌తోపాటు, అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ నిర్ణయానికి అసెంబ్లీ అమోదం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలు తప్ప, తన ఫొటోలు కనిపించకూడదని భగవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో 25,000 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
మరోవైపు మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో ప్రవేశాల కోసం ప్రత్యేకంగా ఢిల్లీలో పాఠశాల ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఈ రోజు ప్రకటించారు. షాహిద్ భగత్ సింగ్ మిలిటరీ ప్రిపరేటరీ స్కూల్ గా దీని నామకరణం చేస్తున్నట్టు, ఇందులో విద్యార్థులకు కేవలం రక్షణ బలగాల్లో చేరేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారని కేజ్రివాల్ ఢిల్లీలో వెల్లడించారు. ఈ ఏడాది నుంచే విద్యార్థులకు మిలిటరీ స్కూల్ అందుబాటులోకి వస్తుందన్నారు.
Also Read : మణిపూర్ సిఎంగా బిరెన్ సింగ్ ప్రమాణ స్వీకారం