Babu Brands: పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతగా ‘999 పవర్ స్టార్’, బావ మరిది కోసం ‘లెజెండ్ 999’పేరిట కొత్త మద్యం బ్రాండ్లు తీసుకు వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన పదవీ కాలంలో 254 కొత్త బ్రాండ్లు తీసుకువచ్చారని వెల్లడించారు. రాష్ట్రంలో మద్యం పాలసీపై శాసన సభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో జగన్ పాల్గొన్నారు.
గత ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తరువాత కౌటింగ్ సమయంలోపు తన ప్రభుత్వం మారబోతుందని తెలిసి కూడా ఎన్నో కొత్త బ్రాండ్లకు అనుమతి మంజూరు చేశారని జగన్ విమర్శించారు. ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్, హై వోల్టేజ్, గవర్నర్ రిజర్వ్ లాంటి బ్రాండ్లు అయన హయాంలోనే వచ్చాయని వివరించారు. స్పెషల్ స్టేటస్, త్రీ కాపిటల్స్ అనే బ్రాండ్లు లేకపోయినా తమ ప్రభుత్వంపై బురద జల్లడానికే వాటి డూప్లికేట్ స్టిక్కర్లు తయారు చేసి, మద్యం సీసాలకు అతికించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని, కేవలం క్రిమినల్ మైండ్ ఉన్నవారికే ఇది సాధ్యమని దుయ్యబట్టారు. దిశ, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ జగనన్న ఇళ్ళ పట్టాలు…. ఇవన్నీ తమ బ్రాండ్లని స్పష్టం చేశారు.
సిఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు:
- రాష్ట్రంలో చీప్ లిక్కర్ లేదు
- జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను కూడా కల్తీ సారా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు
- డిస్టిలరీల ద్వారా మద్యం ప్రమాణాల మేరకు తయారవుతుంది కాబట్టి తక్కువ ప్రమాదకరం
- ఎవరి పాలనలోనైనా బ్రాండ్ల మద్యం తయారీకి ఒకే ప్రక్రియ ఉంటుంది
- ఐ ఎం ఎఫ్ ఎల్ బ్యాచ్ అని తెలిసి కూడా చీప్ లిక్కర్ అంటూ నాటు సారా గా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు
- రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని తగ్గించాలని చూస్తున్నారు.
- అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు
- డిస్టిలరీలు, బ్రీవరీల్లో ఎక్కువ టిడిపి నేతలవే
- విశాఖ డిస్టిలరీస్ అయ్యన్నపాత్రుడిది కాదా?
- పీఎంకే డిస్టిలరీస్ యనమల వియ్యంకుడిది కాదా?
- శ్రీకృష్ణ డిస్టిలరీస్ ఆదికేశవులు నాయుడిది కాదా?
- రాష్ట్రంలో 20 డిస్టిలరీల్లో 1982కు ముందు కేవలం 5 మాత్రమే ఉన్నాయి
- చంద్రబాబు వచ్చిన తరువాతే ఇన్ని కంపెనీలకు అనుమతులు ఇచ్చారు.
- చంద్రబాబు ఇంటిపేరు నారా బదులు సారా అంటే బాగుంటుంది
- చంద్రబాబు కొత్త బ్రాండ్లకు అనుమతులిస్తే మా హాయంలో 16కొత్త మెడికల్ కాలేజీలకు, 16 జిల్లాలకు అనుమతిచ్చాం
- నాటు సారాను అరికట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాం
- దీనికోసం ప్రత్యేకంగా ఎస్ ఈ బీ ని కూడా తీసుకొచ్చాం
- మద్యాన్ని నియంత్రించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నాం
- మద్య నియంత్రణ కోసమే రేట్లు పెంచాం, కానీ నాటు సారా, అక్రమ మద్యం పెరుగుతుండడంతో రేట్లు తగ్గించాం
- సమస్య నాటు సారాది కాదు, నాటు ‘నారా’ది
- అధికారం లేదన్న కడుపు మంటతోనే ఇదంతా చేస్తున్నారు
Also Read : అసెంబ్లీలో చిడతలు: స్పీకర్ ఆగ్రహం