Saturday, November 23, 2024
HomeTrending Newsపంట సేకరణకు ఏకీకృత విధానమే మార్గం - తెరాస

పంట సేకరణకు ఏకీకృత విధానమే మార్గం – తెరాస

Kcr Letter To Pm Modi : 

ఒప్పందం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోగా యాసంగిలో మిగిలిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. మిగులు ధాన్యాన్ని కేంద్రం కొనకుంటే వరి రైతులకు ఇచ్చే మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు అర్థం లేదని, ఇది దేశ వ్యవసాయరంగంపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ఇది ఆహార భద్రత లక్ష్యానికే తూట్లు పొడుస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుత యాసంగిలో రాష్ట్రం నుంచి ధాన్యం సేకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్‌ బుధవారం లేఖ రాశారు. ధాన్యం సేకరించేలా కేంద్ర ఆహార శాఖను ఆదేశించాలని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ), ఎమ్మెస్పీ అమలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్న విషయం మరిచిపోరాదని సూచించారు. ఈ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా ఆహార పంట ఉత్పత్తులను సేకరించి, రాష్ర్టాలకు సరఫరా చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని గుర్తు చేశారు. గతంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సవ్యంగా సాగేదని, రెండేండ్లుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ఆహార శాఖ విముఖత వ్యక్తం చేస్తున్నదని విమర్శించారు.

రాష్ట్ర చర్యలతో వ్యవసాయం అభివృద్ధి
—————————
తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల వంటి అభివృద్ధి చర్యలతో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వ్యవసాయరంగ అభివృద్ధి, పంట ఉత్పత్తులు పెరగడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, వలసలు గణనీయంగా తగ్గాయని గుర్తుచేశారు. పంటల సాగులో వైవిధ్యం చూపాల్సిన ఆవశ్యకతను గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. పత్తి, ఆయిల్‌ పామ్‌, ఎర్రజొన్న తదితర పంటల సాగుపై రైతులను ప్రోత్సహించేందుకు అనేక చురుకైన చర్యలను చేపట్టిందని వివరించారు. ఫలితంగా 2021 యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 2022 యాసంగిలో 36 లక్షల ఎకరాలకు తగ్గిందని తెలిపారు. పంటల మార్పిడికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

జాతీయ సేకరణ విధానం రూపొందించండి
——————————
అత్యంత కీలకమైన ఆహార పంట ఉత్పత్తుల సేకరణకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ విధానం అమలుకు చట్టబద్ధత కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ‘ఇప్పటికీ జాతీయస్థాయిలో ఆహార ధాన్యాల సేకరణ విధానం ఏకరీతిగా లేదు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌, హర్యానా వంటి కొన్ని రాష్ర్టాల్లో వరి, గోధుమ పంటలను మొత్తం సేకరిస్తూ, తెలంగాణ వంటి ఇతర రాష్ర్టాల్లో తీసుకోవటంలేదు. ఒకే దేశంలోని వివిధ రాష్ర్టాలకు వేర్వేరు విధానాలు ఉండకూడదు. అన్ని రాష్ర్టాల సీఎంలు, వ్యవసాయరంగ నిపుణులతో చర్చించి సముచిత జాతీయ సేకరణ విధానాన్ని రూపొందించాలి. దేశంలో దాదాపు సగం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా ఉంచడంలో వ్యవసాయరంగం కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రగతిశీల, స్థిరమైన రైతు అనుకూల విధానాలు అనుసరించడం చాలా ముఖ్యం. కానీ కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న అస్థిర, అనిశ్చిత విధానాలు రైతుల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తిని కలిగిస్తున్నాయి. గత రెండేండ్లుగా కేంద్రం రైతుల ఆగ్రహాన్ని చూసింది. వారి ఆగ్రహానికి కేంద్రం తలవంచి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేకపోయింది’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: కేంద్రమంత్రి బిశ్వేశ్వ‌ర్‌ బ‌ర్త‌ర‌ఫ్ కు టీఆర్ఎస్ డిమాండ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్