Its Trash: రాష్ట్ర ఖజానాలో 48 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయంటూ టిడిపి నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్ పై ఏం మాట్లాడాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అర్ధం కావడం లేదని, అంకెల గారడీ అనడానికి లేదు కాబట్టి ఏదో ఒకటి అనాలన్న ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రతి రూపాయికి సరైన లెక్క ఉందని వెల్లడించారు. ఢిల్లీ లోని ఏపీ భవన్ లో బుగ్గన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం శోచనీయమని యనమలను ఉద్దేశించి అన్నారు.
“మన డబ్బు రూ.100 ఒక వేళ పొరపాటున వేరే ఖాతాలో పడితే, ఆ మర్నాడే దాన్ని బ్యాంక్ మేనేజర్ సరి చేస్తాడు. అలాంటిది ఏకంగా రూ.48 వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వ పెద్దలు తీసేసుకోవడం సాధ్యమేనా?” అని బుగ్గన ప్రశ్నించారు. వివిధ పద్దుల్లో రూ.26,839 కోట్లు, రూ.9100 కోట్లు, రూ.8891 కోట్లకు సంబంధించి క్లారిటీ లేదని కాగ్ అధికారులు అడిగితే దీనిపై గత ఏడాది అక్టోబరు 14న ఒక లేఖ రాశామని, రూ.48,509 వేల కోట్ల లెక్కలను అందులో చాలా స్పష్టంగా చెప్పామని వివరించారు.
వాటిని స్పెషల్ బిల్స్ అంటుంటే, ట్రెజరీ కోడ్‌లో స్పెషల్ బిల్ అనే పద్దు లేదని టిడిపి నేతలు అంటున్నారని, . అయితే ఆ వినియోగానికి ఎలాంటి పేరు లేదు కాబట్టి స్పెషల్ బిల్ అని పెట్టామన్నారు. “ఉదాహరణకు… మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి. ఆ పని చేసే సమయంలో మధ్యలో పేరు లేకపోతే, తాత్కాలికంగా ఏదో ఒక పేరు పెట్టుకుంటాం. సరిగ్గా ఇక్కడా అలాగే స్పెషల్ బిల్స్ అని పేరు పెట్టారు” అని వివరణ ఇచ్చారు.
మొత్తం రూ.48,509 కోట్లకు సంబంధించి ప్రతి రూపాయి వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయని, అయినప్పటకీ టిడిపి నేతలు అన్యాయంగా, దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని బుగ్గన ఆక్షేపించారు. ఇకనైనా టిడిపి నేతలు అర్ధం లేని విమర్శలు, నిందలు మానుకోవాలని బుగ్గన సూచించారు.
Also Read : నెల్లూరులో సిఎం పర్యటన