రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఈ – సిటీలో విప్రో కన్‌స్యూమర్ కేర్ ఫ్యాక్టరీని ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీతో కలిసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అజీమ్ ప్రేమ్‌జీని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అజీమ్ ప్రేమ్‌జీ వంటి గొప్ప వ్యక్తి మన మధ్య ఉండటం గొప్ప విషయమన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం, మంచి పాఠం అని పేర్కొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం అందరికీ ఆదర్శమని కొనియాడారు.
రాష్ట్రంలోని మహేశ్వరం నియోజకవర్గంలో రూ. 300 కోట్లతో విప్రో పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా 900 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కందుకూరు, మహేశ్వరానికి చెందిన 90 శాతం మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ కంపెనీలో ఉత్పత్తి అయ్యే వస్తువుల తయారీలో భాగంగా ఏర్పడే కాలుష్యం బయటకు విడుదల కాకుండా జర్మన్ సాంకేతికతతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా సరళతర వాణిజ్యం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. కొత్త పరిశ్రమలకు రాయితీలు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read : హైదరాబాద్ అభివృద్ధికి బహుముఖ వ్యూహం