Unnecessary issue: భద్రాద్రి రాముడికి తండ్రి లేడా? అని ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ఒక ఆలోచనాపరుడు లోతయిన వ్యాసం రాశాడు. ఇలాంటి వివాదాలు మంచివి కాదు- అని బాధపడుతూ ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకుడు అదే ఎడిట్ పేజీలో సుదీర్ఘమయిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. యాజమాన్య విధానాలతో సంబంధం లేకుండా భిన్నవాదనలను వినిపించే జ్యోతి ఎడిట్ పేజీని ముందు అభినందించాలి. ఈ రెండు వాదనల్లో ప్రధానమయిన విషయం ఏమిటో చూసి తరువాత చర్చలోకి వెళదాం.
ఒక వాదన:
దక్షిణ అయోధ్యగా పేరుపొందిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం భద్రాద్రి సీతారామ కళ్యాణంలో రాముడి ప్రవర అంటే వంశ వృక్షం చెప్పేప్ప్పుడు “రామనారాయణ వరాయ” అంటున్నారు. గతంలో దశరథ పుత్రాయ అని దశరథుడి కొడుకు అయిన రాముడు అని చెప్పేవారు. ఇలా మార్చడం మంచిది కాదు. కోరి దశరథుడికి కొడుకుగా పుడితే- ప్రవరలో ఆ మాట చెప్పకపోవడం భావ్యం కాదు.
మరో వాదన:
దశరథః, దాశరథి అన్న మాటల్లో వ్యాకరణం ప్రకారం అకారాంత పులింగం, ఇకారాంత స్త్రీ లింగం, భౌతికర్థం, పండితార్థం, మంత్రార్థం, వేదార్థం…ఇలా సామాన్యులకు అర్థం కాని, సామాన్యులు అందుకోలేని ఆగమ విధానాలు ఉంటాయి. అక్షరాలా భద్రాద్రి రాముడు నారాయణుడే. కాబట్టి రామనారాయణ ప్రవరే సరయినది.
అసలు జరగాల్సిన చర్చ:
తార అంటే పైన ఉండేది. అవ అంటే కిందికి దిగడం. అవతరించడం అంటే పైనుండి కిందికి దిగిరావడం. రావణాసురుడు అడిగిన వరం ప్రకారం దేవుడే దిగి వచ్చి మనిషిగా పుడితే తప్ప, రావణ వధ జరగనే జరగదు. కాబట్టి ఆయన సాక్షాత్తు నారాయణుడు అన్నది ఎంత నిజమో- అక్షరాలా ఆయన మనిషిగా పుట్టాడు అన్నది కూడా అంతే నిజం. నిజానికి రామావతారం మనిషిని గెలిపించడానికే. అలాంటప్పుడు దశరథుడి కొడుకుగా ఆయనను గుర్తించకపోవడం సమంజసం కాదు. పదకొండువేల సంవత్సరాల తరువాత బ్రహ్మ వచ్చి స్వామీ! నీవు అవతారం పరిసమాప్తి చేయాలి. చాల రోజులుగా వైకుంఠంలో ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి…అంటే స్వామి ఎవరు? వైకుంఠం ఏమిటి?
“ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమ్”
అని- నేను అందరిలా మనిషిని; దశరథుడి కొడుకును అని స్వయంగా ఆయనే చెప్పుకున్న మాటను వాల్మీకి యథాతథంగా రిపోర్ట్ చేశాడు.
ఇంతకంటే లోతుగా వెళ్లి దీన్ని వివాదం చేయడం నాకు ఇష్టం లేదు. రాముడు దశరథుడి కొడుకే అయినా- కొడుకుగా గుర్తించాల్సిన అవసరం లేదనే వేద, ఆగమ ప్రమాణాల మీద చర్చించేంత పాండిత్యం, అవగాహన కూడా నాకు లేవు. కడప ఒంటిమిట్టలో కోదండరాముడి పక్కన ఆంజనేయస్వామి ఉండడు. ఎందుకంటే అక్కడ వెలసిన కోదండరాముడు అప్పటికి ఆంజనేయస్వామిని కలవలేదు. దీనికి పురాణ, శాస్త్ర ఆధారాలు దొరకవు. వెతకడం కూడా వృథా. భక్తుల నమ్మకం. ఆచారం.
రాముడు దశరథుడి కొడుకే అయినా- అంతకు ముందు ఆయన అసలురూపమయిన నారాయణుడిగానే గుర్తించడంలో ఎంతో లోతయిన పరమార్థం దాగి ఉండవచ్చు. ఇదే శాస్త్రం అంగీకరించిన కొలమానమయితే- యాదాద్రిలో నరసింహుడు కూడా ముందు నారాయణుడే. తిరుమలలో వెంకన్న కూడా ముందు నారాయణుడే. సింహాచలంలో అప్పన్న కూడా ముందు నారాయణుడే. రేపల్లెలో కృష్ణుడు కూడా ముందు నారాయణుడే. ఇంకా ముందుకు వెళితే-
“శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే”
శివుడే విష్ణువు. విష్ణువే శివుడు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒకడే. ఒకటే.
“లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్”
రాములో! రాములా!
ఇంతకూ నీవెవరు?
(గడచిన ఏడాది శ్రీరామనవమి సందర్భంగా జరిగిన “రామనారాయణ” వివాదమప్పటి వ్యాసమిది. మళ్లీ అదే నవమి. అదే రామనారాయణ కథ. అంతులేని కథ. పేరు గొప్ప కోసం దేవుడి పేరిట జరుగుతున్న కథ)
-పమిడికాల్వ మధుసూదన్
ఇవి కూడా చదవండి: