Saturday, November 23, 2024
HomeTrending Newsకౌలు రైతులకు రుణాలివ్వండి : బ్యాంకర్లతో సిఎం

కౌలు రైతులకు రుణాలివ్వండి : బ్యాంకర్లతో సిఎం

కౌలు రైతులకు రుణ సదుపాయం కల్పించడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు.  గ్రామాల స్థాయిలో ఆర్బీకేలు ఉన్నాయని, ఇ– క్రాపింగ్‌ కూడా గ్రామ సచివాలయాల స్థాయిలో చేస్తున్నామని, ప్రతి కార్యక్రమం పారదర్శకంగా చేస్తున్నామని చెప్పారు. సిఎం క్యాంప్‌ కార్యాలయంలో 215వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎస్‌ఎల్‌బీసీ ఏపీ, కన్వీనర్‌ వి బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం, సుధీర్‌ కుమార్‌ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్, ఆర్‌బీఐ జీఎం, యశోధా భాయిలు ఈ సమావేశానికి వర్చువల్ గా పాల్గొన్నారు.

స్కూళ్లు, ఆస్పత్రులలో నాడు – నేడు కింద పనులు చేపట్టామని, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం తీసుకు వచ్చి సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌కూడా చేశామన్నారు.  వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను జాతీయ స్ధాయిలో మెరుగుపర్చేందుకు… గ్రామ స్ధాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు మొదలుకుని  టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ ఆస్పత్రులను అభివృద్ధి చేపట్టామని సమావేశంలో సిఎం జగన్ వివరించారు.

వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని,  గ్రామ స్ధాయిలో రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే)ను తీసుకు వచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేలకు పైగా ఆర్బీకేలను నెలకొల్పామన్నారు. నాణ్యమైన ధృవీకరించిన విత్తనాల దగ్గరనుంచి, పండించిన పంటను అమ్మేంతవరకూ రైతుకు చేదోడు, వాదోడుగా ఈ ఆర్బీకేలు నిలుస్తాయన్నారు.

మహిళా సాధికారిత, 17వేలకుపైగా కొత్త కాలనీలను నిర్మాణం, ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలు, ఎంఎస్‌ఎంఈ లకు ప్రోత్సాహకాలు అంశాల్లో కూడా బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళిక 2.83 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ణయించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. వ్యవసాయానికి రూ. 1.48 లక్షల కోట్లు కాగా, పరిశ్రమల రంగానికి 45 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రతిపాదించామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సహకరించాలని బ్యాంకర్లను కోరామని కన్నబాబు తెలియజేశారు. మొత్తంగా ప్రాథమిక రంగానికి రూ. 2,13,560 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్షంగా పెట్టుకున్నామని, వార్షిక రుణ ప్రణాళికలో ఇది 75.36 శాతమని మంత్రి వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్